(Source: ECI/ABP News/ABP Majha)
Disha Encounter Case: కొనసాగుతున్న దిశ ఎన్ కౌంటర్ కేసు విచారణ, లారీ ఓనర్ ఆ విషయం చెప్పనేలేదట!
Disha Encounter Case: దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ కేసులో తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. నేడు హైకోర్టులో విచారణ జరగగా.. బాధితుల తరఫు న్యాయవాది పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
Disha Encounter Case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. సిర్పూర్కర్ కమిషన్ హైకోర్టుకు సమర్పించి నివేదికపై నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలోనే బాధితుల తరఫున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ వృందా గ్రోవర్.. తన వాదనలు వినిపించారు. ఎన్ కౌంటర్ తీరును కోర్టు దృష్టికి తీసుకు వచ్చిన వృందా.. పోలీసులు వెల్లడించిన పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పోలీసు కస్టడీలోని ఉన్న నలుగురు నిందితులను సీర్ రీ కన్ స్ట్రక్షన్ చేసే పేరుతో ఎన్ కౌంటర్ చేశారని ఆమె వాదించారు. సీసీ టీవీలో లారీని చూసి మొదట గుర్తు పట్టింది ఓనర్ శ్రీనివాస్ రెడ్డి అని పోలీసులు తెలిపారని.. కానీ కమిషన్ ముందు లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి ఆ విషయం చెప్పలేదని వివరించారు. ఈరోజుతో ఆమె వాదన ముగిశాయి. ఇక ప్రభుత్వం తరఫు వాదనలే మిగిలి ఉన్నాయి. మరి ప్రభుత్వం తరఫు న్యాయవాది ఏం మాట్లాడనున్నారో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. ఈ క్రమంలోనే తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది.
ఏడు నెలల కిందటే సిర్పూర్కర్ కమిషన్ నివేదిక
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఓ కట్టుకథలా ఉందని ఏడు నెలల కిందట సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చేసింది. మరి ఎన్‌కౌంటర్ గురించి పోలీసులు చెప్పింది కట్టుకథ అయితే.. అసలు నిజం ఏంటనే వాదనలు వినిపించాయి. పోలీసుల వాంగ్మూలంలో తప్పులున్నాయని చెప్పిన కమిషన్.. వాస్తవంగా ఏం జరిగిందో చెప్పడంలో విఫలం అయిందని పోలీసుల తరఫు వాదించిన న్యాయవాది కోట కీర్తి కిరణ్ అన్నారు. మూడేళ్ల కిందట హైదరాబాద్ సమీపంలో జరిగిన దిశ అత్యాచారం, హత్య అప్పట్లో కలకలం రేపింది. అయితే ఆ తర్వాత వారం రోజులకే ఆ హత్యాచారం కేసులో నిందితులకు సంబంధించిన ఎన్ కౌంటర్ కూడా అంతే సంచలనంగా మారింది. అయితే, ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని, ఎన్ కౌంటర్ కు సంబంధించి పోలీసులు చెబుతున్న విషయాలు ఏవీ నమ్మ దగ్గవిగా లేవని దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సిర్పూర్కూర్ కమిషన్ పేర్కొంది.
10 మంది పోలీసులపై హత్య కేసులు నమోదు చేయాలి..!
ఈ ఘటనతో సంబంధం ఉన్న 10 మంది పోలీసులపై హత్య కేసులు నమోదు చేయాలని కూడా నివేదికలో పొందుపరిచారు. జరిగిన ఘటనపై నిజ నిర్దారణ చేయడానికి ఏర్పాటైన విచారణ కమిషన్- "నిజాన్ని" కనుక్కోవడంలో మాత్రం విఫలం అయిందని అన్నారు. పోలీసులు చెప్పిన దాంట్లో తప్పులు ఉన్నాయని భావించినప్పుడు, జరిగిన నిజం ఏంటో కూడా వాళ్లు చెప్పాల్సి ఉందన్నారు. ఏబీపీ దేశంతో మాట్లాడిన ఆయన... "సుప్రీం కోర్టు సిర్పూర్కర్ కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదు. సింపుల్ గా చెప్పాలంటే.. కేసును హైకోర్టుకు ట్రాన్స్ ఫర్ చేసి ఈ నివేదికపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని హైకోర్టుకు అప్పగించింది.