Dhruva Space: హైదరాబాద్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ 'ధృవ' స్పేస్ కు రూ.123కోట్ల పెట్టుబడులు
Hyderabad News: ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ధృవ స్పేప్ పెట్టుబడులపై ఫోకస్ చేసింది. గడచిన రెండేళ్లలో అంతరిక్ష రంగంలో గణనీయమైన ప్రగతి సాధించిన ఈ సంస్థ రూ.123 కోట్లు సమీకరించింది.
Dhruva Space Private Limited- హైదరాబాద్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ 'ధృవ' స్పేస్ రూ.123కోట్ల పెట్టుబడులను సమీకరించిందని ఆ సంస్థ వెల్లడించింది. ఉపగ్రహాలు వాటికి సంబంధించిన సేవలపై దృష్టి సారించిన ఈ సంస్థ గడచిన రెండేళ్లలో అంతరిక్ష రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించింది. 2022 నవంబర్ ఇస్రో ద్వారా థైబోల్ట్ ఉపగ్రహ ప్రయోగం, 2024 జనవరిలో LEAP-TD మిషన్ ద్వారా అద్భుతమైన విజయాలు సాధించింది ఈ స్పేస్ స్టార్టప్.
సీఈవో సంజయ్ నెక్కంటి ఏమన్నారంటే..
ఫలితంగా ధృవ స్పేస్ విజన్, లక్ష్యాలపై నమ్మకం ఉంచిన ఇండియన్ ఏంజెల్ నెట్ వర్క్ ఆల్ఫా ఫండ్, బ్లూ ఆష్వా క్వాపిటల్, సిల్వర్ నీడిల్ వెంచర్స్, బిగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ జేఎస్ఈ(BITEXCO Group), ఇవీక్యాప్ వెంచర్, ముంబై ఏంజెల్స్, బ్లూమ్ ఫౌండర్స్ ఫండ్ మొదలైనవి ధృవ స్పేస్ ఫండ్ సిరీస్ A రౌండ్ లో భాగస్వామ్యమయ్యాయి. వీటితో పాటు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI) పదికోట్లు, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు 14కోట్ల రూపాయల ఆర్థికసహకారాన్ని అందించనున్నాయి. ఫలితంగా సిరీస్ A1లో 45కోట్ల 51లక్షలు, సిరీస్ A2లో 78కోట్ల రూపాయల నిధులను ధృవ స్పేస్ సమీకరించనట్లు ఆ సంస్థ సీఈవో సంజయ్ నెక్కంటి తెలిపారు.
ఈ ఫండింగ్ కారణంగా ధృవ స్పేస్ ప్రపంచ దేశాల్లో తమ వాణిజ్యాన్ని విస్తరించుకోవటంతో పాటు విదేశీశాటిలైట్ ఇమేజరీ ప్రొవైడర్స్ తో కలిసి మరింత మెరుగ్గా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తుందని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా ప్రస్తుతం ధృవ స్పేస్ దృష్టిసారించిన P-30 నానో శాటిలైట్ ప్లాట్ ఫామ్, P-90 మైక్రోశాటిలైట్ ప్లాట్ ఫామ్ ల పనులు సైతం వేగవంతం చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే శంషాబాద్ లో రెండు లక్షల 80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపుగా లక్షా 20వేల చదరపు అడుగుల్లో విస్తీర్ణం తీసుకుని అందులో కంపెనీ విస్తరణ కోసం ఫేజ్ 1 అభివృద్ధి పనులను ధృవ స్పేస్ ప్రారంభించింది. తెలంగాణలో పూర్తి స్థాయి స్పేస్ టెక్నాలజీ సంస్థగా ఆవిర్భవించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.