ధరణి పోర్టల్ ప్రారంభం నుంచే అనేక లోపాలు, త్వరలోనే మధ్యంతర నివేదికిస్తామన్న కమిటీ
వీలయినంత తొందరగానే ధరణి సమస్యలపై మధ్యంతర నివేదిక ఇస్తామని కోదండరెడ్డి నేతృత్వంలోని కమిటీ తెలిపింది. మూడోసారి సీసీఎల్‌ఏలో సమావేశమైన కమిటీ.. అనేక అంశాలపై చర్చించింది.
Dharani Committee : వీలయినంత తొందరగానే ధరణి సమస్యలపై మధ్యంతర నివేదిక ఇస్తామని కోదండరెడ్డి ( Kodanda REddy) నేతృత్వంలోని కమిటీ తెలిపింది. మూడోసారి సీసీఎల్‌ఏ (CCLA) లో సమావేశమైన కమిటీ.. అనేక అంశాలపై చర్చించింది. ధరణి పోర్టల్ (Dharani Portal) ప్రారంభం నుంచే అనేక లోపాలు ఉన్నాయని, బాధితులకు ఉపశమనం కల్పించేందుకు మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది.
ధరణి వెబ్ సైట్ లోపభూయిష్టంగా ఉండటంతో...అనేక మంది రైతులు భూ హక్కులు కోల్పోయారని కమిటీ సభ్యులు కోదండరెడ్డి వెల్లడించారు. ఈ పోర్టల్‌లో పారదర్శకత లేదన్న ఆయన, భూమి యజమానికి తెలియకుండా లావాదేవీలు జరిగాయన్నారు. అనేక తప్పిదాల కారణంగా అన్నదాతలు... రైతుబంధు, ఇతర ప్రభుత్వ రాయితీలను పొందలేకపోయారని స్పష్టం చేశారు. ధరణి బాధితులకు త్వరితగతిన ఉపశమనం కల్పించేందుకు మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్ణయించిందన్నారు. మరింత లోతైన అధ్యయనం చేయకుండా ముందుకు వెళ్లలేమని తెలిపారు. పోర్టల్ సమస్యలతో పాటు దానితో ముడిపడి ఉన్న అన్ని శాఖలతో చర్చించి సమగ్రమైన నివేదిక సిద్ధం చేయాల్సి ఉందని వెల్లడించింది.
వాస్తవికతకు అద్దం పట్టేలా భూరికార్డుల కంప్యూటరైజ్డ్ చేయాల్సిన అవసరం ఉంటుందని ధరణి కమిటీ తెలిపింది. ధరణిలో ఒక సమస్యకు మరో సమస్యకు పొంతన లేకుండా ఉన్నాయని, ధరణి ప్రారంభం నుంచే అనేక లోపాలు ఉన్నాయని, ధరణి వల్ల భూ హక్కు హరించిపోయిందని చెప్పింది. రానున్న రోజుల్లో జిల్లా కలెక్టర్లతో పాటు వ్యవసాయ, రిజిస్ట్రేషన్ శాఖలతో కూడా సమావేశమవుతామని కమిటీ తెలిపింది. అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల్లోకి వెళ్లి, సమగ్రంగా అధ్యయనం చేశాకే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వెల్లడించింది. ధరణి వచ్చిన తర్వాత వెంటనే పనులు జరగడం బాగానే ఉన్న, పారదర్శకత కొరవడిందన్నారున ఇదొక పెద్ద సమస్యగా పేర్కొన్న కమిటీ, మరింత లోతైన అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
భూములు కంప్యూటరైజ్డ్ అంటే వాస్తవికతకు అద్దం పట్టాలని, ధరణిపై చాలా కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని కమిటీ తెలిపింది. ధరణి సబ్జెక్టుపై అవగాహన కలిగిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటామని, భూ యజమానికి తెలియకుండా భూ లావాదేవీలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. పోర్టల్ పేరు ఏదైమైనా హక్కుదారి పేరు ఆన్లైన్లో ఉంటే అతనికి చట్టం పరంగా హక్కు ఉన్నట్లేనని, ధరణి కోసం పగడ్బందీగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని రెండు, మూడు అంచెలుగా పూర్తి చేయాలని కమిటీ భావిస్తోంది. ధరణి పోర్టల్ వల్ల భవిష్యత్లో ఎలాంటి సమస్యలు రాకుండా, చాలా సునిశితంగా చర్చించినట్లు కమిటీ తెలిపింది.
మరోవైపు భూముల వివరాలను దాచి పెట్టుకునేందుకు ధరణిలో రైట్ టు ప్రైవసీ అప్షన్ కూడా ఉంది. దీనికి సంబంధించిన బటన్ నొక్కితే సంబంధిత భూముల వివరాలు పోర్టల్‌లో సాధారణంగా కనిపించవు. సాఫ్ట్‌వేర్ నిర్వహించే వ్యక్తులు, తహసీల్దారు, రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రమే కనిపిస్తాయి. అంది కూడా లాగిన్‌లోకి వెళ్లి చూడాల్సి ఉంటుంది. ఈ తరహా వెసులుబాట్లను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమాలకు పాల్పడినట్లు సర్కార్ భావిస్తోంది. హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో ప్రభుత్వ భూములు చేతులు మారాయి. ఏదో ఒక ఉత్తర్వును ఆధారంగా చేసుకొని అధికారుల సహకారంతో వారి పేరుతో ఆన్‌లైన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ధరణిలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది. ఓ జిల్లా అధికారి 89 లావాదేవీలను ఆన్‌లైన్ చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కొత్త ప్రభుత్వం అక్రమాలు జరిగినట్లుగా భావిస్తున్న సర్వే నంబర్లును ఇందులో ఉండటంతో తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.