Hyderabad: అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణకు మొదలైన కౌంట్ డౌన్
ఏర్పాట్లలో ఎలాంటి లోటు రానీయొద్దని ఇప్పటికే ఆదేశాలులక్ష స్వీట్ ప్యాకెట్లు, లక్షన్నర మజ్జిగ ప్యాకెట్లు , లక్షన్నర వాటర్ ప్యాకెట్లు
ఈ నెల 14న జరగబోయే అంబేద్కర్ విగ్రహావిష్కరణకు కౌంట్ డౌన్ మొదలైంది. 125 అడుగుల కాంస్య ప్రతిమ ఆవిష్కరణ ప్రపంచమే అబ్బురపడేలా ఉండాలని ప్రభుత్వం భావించింది. ఏర్పాట్లలో ఎలాంటి లోటు రానీయొద్దని ఇప్పటికే గట్టి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నామని పేర్కొన్నారు. పోలీసు శాఖ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేస్తుందని, ఆర్ అండ్ బీ శాఖ లైటింగ్, షామియానా, కుర్చీలు, పూలు ఏర్పాటు చూసుకుంటుందని తెలిపారు. నిరంతర విద్యుత్ అందించాలని, ట్రాన్స్ ఫార్మర్లను సిద్ధంగా ఉంచాలని విద్యుత్ శాఖను కోరారు.
అదేవిధంగా ఆరోగ్య సిబ్బందితో పాటు అంబులెన్స్ ను సిద్దంగా ఉంచాలని ఆరోగ్య శాఖను సీఎస్ ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో పాటు జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు సరైన సీటింగ్ ఏర్పాట్లు చేయాలని సీఎం ఇదివరకే సూచించారు. 14వ తేదీన వాహనాల రాకపోకల కోసం నెక్లెస్ రోడ్డు మూసివేస్తున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించాలని ప్రజలకు ముందస్తుగా తెలియజేయాలని పోలీసులకు సూచించారు. అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ అత్యంత వైభవోపేతంగా
- హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తూ భారత రాజ్యాంగ నిర్మాతకు పుష్పాంజలి ఘటిస్తారు.
- గులాబీలు, తెల్లచామంతి, తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను రూపొందిస్తున్నారు.
- 125 అడుగుల విగ్రహానికున్న భారీ పరదాను తొలగించడానికి, నిలువెత్తు పూలమాలను అలంకరించడానికి అతిపెద్ద క్రేన్ ఏర్పాటు చేస్తున్నారు.
- ఈ కార్యక్రమానికి బౌద్ధ భిక్షువులను మాత్రమే ఆహ్వానించారు. వారి సాంప్రదాయ పద్దతిలోనే కార్యక్రమం జరుగుతుంది.
- ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, అధికారులు, అన్ని శాఖల HODలు, జిల్లాకలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు.
- ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,700 మంది విగ్రహావిష్కరణ సభకు హాజరుకాబోతున్నారు.
- ప్రజల తరలింపు కోసం 750 ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు.
- హైదరాబాద్ చేరుకునేలోపే 50 కిలోమీటర్ల దూరంలోనే సభకు వచ్చిన ప్రజలకు భోజనం ఏర్పాట్లు చేశారు.
- ప్రజల కోసం లక్ష స్వీట్ ప్యాకెట్లు, లక్షన్నర మజ్జిగ ప్యాకెట్లు , లక్షన్నర వాటర్ ప్యాకెట్లు సిద్ధంచేశారు.
- పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం వున్నందునప్రజలకు ఎండవేడి తగలకుండా షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు.
- సభ రోజు సామాన్య ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్న్యాయ మార్గాలను పోలీస్ యంత్రాంగం సూచిస్తారు.
- ఘనమైన రీతిలో ఆట పాటలతో సంబురాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. గాయకుడు సాయిచంద్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ కల్చరల్ ప్రోగ్సామ్స్ రూపొందిస్తున్నారు.
- అంబేద్కర్‌కు సంబంధించిన పాటలను మాత్రమే పాడుతూ, ఆ మహనీయునికి సాంస్కృతిక నీరాజనం అర్పించాలని సీఎం సూచించారు. ఇందుకు సంబంధించిన రిహార్సల్స్ బాధ్యత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీసుకున్నారు.
- విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ ముని మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ మాత్రమే ముఖ్య అతిథిగా ఆహ్వనించారు.
- అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి మహారాష్ట్రకు చెందిన రామ్ వంజీ సుతార్‌ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సత్కరిస్తారు.
- ఏప్రిల్ 14న మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమై సా. 5 గంటలకు ముగుస్తుంది.
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభోపన్యాసంతో సభ ప్రారంభమౌతుంది. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగం వుంటుంది. తర్వాత ముఖ్య అతిథి ప్రకాశ్ అంబేద్కర్ ప్రసంగిస్తారు. ఫైనల్ సందేశం సీఎం కేసీఆర్ ఇస్తారు.