Khajaguda Lands PIL: ఖాజాగూడ భూములపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిటిషన్: గత ప్రభుత్వంపై ఆరోపణలు? హైకోర్టు రియాక్షన్
Hyderabad News | శేరిలింగపల్లి మండలం ఖాజాగూడ సర్వే నెం.119..122లో ఉన్న 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించారని హైకోర్టులో వేసిన పిల్ లో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

Congress MLAs Petition on Khajaguda Lands | హైదరాబాద్: ఖాజాగూడలో 27.18 ఎకరాల భూమి ఆక్రమణకు గురయిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (PIL) దాఖలు చేశారు. ఈ పోరంబోకు భూమి విలువ 2 వేల కోట్ల నుండి 10 వేల కోట్ల వరకు ఉంటుందని వారు ఆరోపిస్తున్నారు.
పిల్ లో పేర్కొన్న అంశాలు ఇవే:
ఈ మేరకు వారు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే శేరిలింగపల్లి మండలం ఖాజాగూడ సర్వే నెం.119..122లో ఉన్న 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించారని హైకోర్టులో వేసిన పిల్ లో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కొందరు మున్సిపల్ అధికారులు, ఈ ప్రైవేటు బిల్డర్లతో కలిసి అక్రమంగా ఈ భూమిని బదిలీ చేశారని, అందులో నిర్మాణాలు చేపట్టేందుకు సదరు బిల్డర్లకు అనుమతులు కూడా ఇచ్చారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆక్రమణకు గురయిన భూమిలో 47 అంతస్తుల ఎనిమిది భారీ టవర్ల నిర్మాణం జరుగుతుందని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని పిల్ లో పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూమిని బదిలీ చేశారని, నిర్మాణ అనుమతులు అక్రమమని ఎమ్మెల్యేలు హైకోర్టులో వేసిన పిల్ లో వివరించారు. ఈ విషయంలో HYDRAA (Hyderabad Urban Development Authority) కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిల్ లో పేర్కొన్నారు.
హైకోర్టు ఏం చెప్పిందంటే..?
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలు కలిసి వేసిన పిల్ పై హైకోర్టు ప్రాథమిక విచారణ జరిపింది. పిటిషనర్లు HYDRAA కు ఇచ్చిన ఫిర్యాదులో సర్వేనంబర్లు, అవసరమైన వివరాలు లేవని గుర్తించింది. పూర్తి వివరాలతో కొత్త పిటిషన్ ను సంబంధిత అధికారులకు ఇవ్వాలని, ఆ కాపీని కోర్టుకు సమర్పించాలని ఎమ్మెల్యేలకు సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా?
1958 వరకు ఈ సర్వేలోని భూమి ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉంది. ఆ తర్వాత 1995 లో జిల్లా రెవెన్యూ అధికారి (DRO) రెక్టిఫికేషన్ ఆర్డర్ ద్వారా ఇవి ప్రైవేటు వ్యక్తుల పేర్లపై ఆ భూమిని రికార్డులు చూపడం జరిగింది. అయితే ఈ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ యాజమాన్య హక్కులు లేని వారు, దీనిపై హైకోర్టులో అప్పీలు చేసిన వ్యక్తి మధ్య రాజీ కుదరడంతో 2017లో హైకోర్టులో కేసు ఉపసంహరించుకున్నారు. దీని వల్ల ఆ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతికి మళ్లీ వెళ్లిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ తర్వాతే ఈ భూమిలో నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారం అంతా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే జరిగింది. అంటే ఈ నిర్మాణాలకు అధికారులు అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ హయాంలోనే. ఇలా దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిల్ వేయడం ద్వారా గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.






















