Mynampally Rohit Car Number: కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ కారు నెంబర్‌తో మరో కారు - ఎలా గుర్తించారంటే !
Telangana News: కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కారు నెంబర్ తో మరో వాహనం తిరుగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు కారు చలాన్ రావడంతో కంగుతిన్నారు. చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Congress MLA Mynampally Rohit complaint to police there is another car with his car number పేట్ బషీరాబాద్: పెరుగుతున్న టెక్నాలజీతో పాటు ఆన్ లైన్ నేరాలు, సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వీలు చిక్కితే ఎవర్నీ వదలిపెట్టడం లేదు. ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులను సైతం బురిడీ కొట్టించేందుకు చూస్తున్నారు. కొందరు లింక్స్ షేర్ చేసి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు కాజేస్తుంటే.. మరికొందరు నేతలు, అధికారుల గుర్తింపును వాడుకుని అక్రమాలు చేస్తూ అడ్డంగా దొరికిపోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కారు నెంబర్ తో మరొక కారు ఉన్నట్లు ఆయన గుర్తించారు. ఓవర్ స్పీడ్ కారణంగా తీసిన చలాన్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఈ విషయాన్ని గుర్తించారు. తన కారు నెంబర్ TS 10 FB 9999 కాగా, అదే నెంబర్ తో మరొక కారు రోడ్లపై తిరుగుతుందని పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే రోహిత్ సిబ్బంది పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కేటుగాళ్లు ఏ మాత్రం అవకాశం దొరికినా సెలబ్రిటీలతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులకు సంబంధించిన వివరాలను దుర్వినియోగం చేసి అందర్నీ బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేస్తుంటారు.
సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ఓవర్ స్పీడ్ తో వెళ్లగా చలాన్ వేసినట్లు ఎమ్మెల్యే రోహిత్ ఫోన్ కు మెస్సేజ్ వచ్చింది. తన కారు SIERRA (Black colour) కాగా, 6 జూన్ 2021లో మైనంపల్లి రోహిత్ పేరిట కారు రిజిస్ట్రేషన్ చేపించారని సిబ్బంది ఆదిత్య రావు పోలీసులకు తెలిపారు. అయితే ఈ మే 11వ తేదీన ఎమ్మెల్యే రోహిత్ కు ఓవర్ స్పీడింగ్ కారు చలాన్ రాగా, వివరాలు చెక్ చేశారు. అది తన కారు కాదు అని Volkswagen Tiagun అని గుర్తించారు. ఈ మేరకు ఆ కారు నెంబర్ వాడుతున్న నిందితులపై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు.