CM KCR: విశాఖ స్టీల్ ప్లాంటుపై తెలంగాణ ప్రభుత్వం ‘ఇంట్రెస్ట్’, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వంపై పోరాట ధోరణి అవలంబిస్తున్న సీఎం కేసీఆర్, విశాఖ ఉక్కు సహా ఎల్ఐసీ వంటి వివిధ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు నిర్వహణ కోసం మూలధనం, ముడిసరకుల (క్యాపిటల్, రా మెటీరియల్) కోసం నిధులు సమకూర్చి, నిబంధనల ప్రకారం ఉక్కు ఉత్పత్తులను కొనడానికి ప్లాంటు యాజమాన్యం నిర్వహిస్తున్న ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-EIO) బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సింగరేణి సంస్థ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ, నీటి పారుదల శాఖల్లో ఏదో ఒక శాఖ ఈ బిడ్డింగ్ లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉన్న సింగరేణి సంస్థ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రక్రియలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ, నీటిపారుదల శాఖలను కూడా ప్రత్యామ్నాయంగా సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై పోరాట ధోరణి అవలంబిస్తున్న సీఎం కేసీఆర్, విశాఖ ఉక్కు సహా ఎల్ఐసీ వంటి వివిధ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఇటీవల లేఖలు కూడా రాశారు. తాజాగా ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ వైఖరిని వెల్లడించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల (Infrastructure) ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
రెండు రోజుల్లో విశాఖకు ఉన్నతాధికారులు
ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రతిపాదనల కోసం వెంటనే విశాఖపట్నం వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఒకటి, రెండు రోజుల్లో అధికారుల బృందం విశాఖపట్నానికి వెళ్లనుంది. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రస్తుత యాజమాన్యం సమకూర్చుకోవాలనుకుంటున్న నిధులు ఎన్ని? అక్కడి నుంచి ఉత్పత్తులు లేదా నిధులను తిరిగిచెల్లించే విధానాలు, ఇతర నిబంధనలు, షరతులను ఈ ఉన్నతాధికారుల టీమ్ బాగా అధ్యయనం చేయనుంది.
ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు..
విశాఖ ఉక్కు కర్మాగారానికి అవసరమైన మూలధనం/ముడి సరకుల కోసం రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ గత నెల 27వ తేదీన ప్రైవేటు, ఇతర స్టీల్ అనుబంధ రంగాల కంపెనీలు లేదా సంస్థల నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెండర్లను ఆహ్వానించింది. ఇది బీజేపీ నేతల అనుకూల కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తూ, ఆఖరికి ప్లాంటు మొత్తాన్ని ప్రైవేటుపరం చేసే ప్రక్రియలో భాగమని ఇటీవలే తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ రూపంలో ప్రైవేటు కంపెనీలను చొప్పించే కుట్రకు కేంద్ర ప్రభుత్వం తెర లేపిందని కేటీఆర్ ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
ప్లాంటు ఉద్యోగ సంఘ ప్రతినిధులను కలిసిన తోట చంద్రశేఖర్
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కలవగా, కర్మాగారం ప్రైవేటీకరణను తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఉన్న పరిష్కార మార్గాలను వారు సూచించారు. వాటిని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి చంద్రశేఖర్ తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై సీఎం సమీక్ష జరిపి, వారి నుంచి సూచనలు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ లో పాల్గొనాలని నిర్ణయించారు. ఈ టెండర్లను ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తే, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయడంపై పార్టీ వ్యతిరేకతను బలంగా చాటడమే కాకుండా, ప్రభుత్వ సంస్థల పరిరక్షణకు వ్యవహరించాల్సిన తీరుపై బలమైన సందేశం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు.
ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ లో ఏముందంటే?
విశాఖ ఉక్కు కర్మాగారంలో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడిఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి వ్యాపార ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు ప్లాంటు యాజమాన్యం మార్చి 27న ప్రకటించింది. బొగ్గు, నేల బొగ్గు, ఇనుప ఖనిజం వంటి ముడి పదార్థాలను సరఫరా చేయడంతో పాటు పరస్పర అంగీకారంతో నిబంధనల మేరకు ఉక్కు ఉత్పత్తులను ప్లాంటు నుంచే కొనాలి. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ దాఖలు చేసే సంస్థలు ఉక్కు లేదా ఉక్కు తయారీ ముడిపదార్థాల వ్యాపారం చేసేవిగా ఉండాలని షరతు ఉంది. ఈ నెల 15న సాయంత్రం మూడు గంటల్లోగా తమ ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది.