Minister KTR: చీమలపాడు దుర్ఘటనపై మంత్రి కేటీఆర్ అనుమానం- దర్యాప్తులో తేలుతుందని ప్రకటన
Minister KTR: ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్ని ప్రమాద బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఇది ప్రమాదమా కుట్రో దర్యాప్తులో తేలుతుందన్నారు.
Minister KTR: ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్ని ప్రమాద బాధితులను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్ లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈరోజు ఉదయం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి మంత్రి కేటీఆర్ నిమ్స్ కు చేరుకున్నారు. బాధితులతో కాసేపు ముచ్చటించారు. నలుగురి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు మంత్రి కేటీఆర్ కు చెప్పారు.
బాధితులకు మెరుగగైన వైద్యసాయం అందించాలని వైద్యులకు కేటీఆర్ సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... చీలమపాడు ఘటన దురదృష్టకరమని చెప్పారు. ప్రమాదంలో కుట్ర కోణం ఉందో లేదో దర్యాప్తులే తేలుతుందని అన్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు.
చీమలపాడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ. పది లక్షల పరిహారాన్ని ఇస్తున్నట్టు ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.2లక్షలు, పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి హమీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని రీతిలో సిలిండర్ పేలి.. ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు కూడా ఫోన్ చేసి, ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎంపీ నామా నాగేశ్వర్ రావు, వైరా ఎమ్మెల్యే
చీమలపాడు వద్ద నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు, వైరా ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే నేతలను ఆహ్వానిస్తూ కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. దీంతో ఆ నిప్పురవ్వలు ఎగిరిపడి సభా ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలో ఉన్న గుడిసెపై పడ్డాయి. దీంతో గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకుని అది పేలిపోయింది. దీంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఆత్మీయ సమ్మేళనానికి, సిలిండర్ పేలుడు ఘటన
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి, సిలిండర్ పేలుడు ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ నామా నాగేశ్వర్ రావు ప్రకటించారు. తాము ఏర్పాటు చేసుకున్న మీటింగ్ కు 200 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందన్నారు. మీటింగ్ ప్రారంభయ్యే సమయంలో తామంతా స్టేజీపై ఉన్నామని, అప్పుడే సిలిండర్ పేలిందన్నారు. ఎండల తీవ్రత వల్ల గ్యాస్ సిలిండర్ పేలి ఉండొచ్చని... చిన్న గుడిసెలో ఉన్నటువంటి గ్యాస్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. బాణాసంచా కాల్చడం వల్లే ప్రమాదం జరగలేదని ఎంపీ చెబుతున్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆందుకుంటామని నేతలు భరోసా ఇచ్చారు.