Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Telangana Thalli Statue Inauguration: రేవంత్ రెడ్డి ఆవిష్కరించేంది తెలంగాణ తల్లి కాదని కాంగ్రెస్ తల్లి అని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఆ విగ్రహాన్ని తిరస్కరిస్తున్నామని ప్రకటించారు.
Telangana Talli statue Controversy : సీఎం రేవంత్ రెడ్డి దుశ్చర్యలకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందని విమర్శలు చేశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కవిత. తెలంగాణ తల్లి రూపు రేఖల్ని మార్చి ఆ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం చాలా దురదృష్టకరమన్నారు. ఇప్పటి వరకు ఉన్న ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చేశారని దాన్ని మేం తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. కోట్ల మంది తెలంగాణ బిడ్డల్లో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడానికి ఖండించారు. రోడ్డుపై రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం చెరశాలలో తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ క్షమాపణలు చెప్పాలి: కవిత
బతుకమ్మతో పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు కవిత. అలాంటి బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకును ఆగం చేశారు బతుకమ్మను మాయం చేశారంటూ ఆక్షేపించారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కు పెట్టినందుకు తెలంగాణ తల్లికి రేవంత్ రెడ్డి ముందు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కవిత. ఆమెకు నివాళులర్పించే హక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదన్నారు. తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలి అనుకుంటే గన్ పార్క్ దగ్గర ముక్కు నెలకు రాయాలన్నారు.
Also Read: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
ప్రభుత్వాలు చేసే పనులు ఇవా?
తెలంగాణ తల్లి రూపం మార్చడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. ఇలాంటివేనా ప్రభుత్వాలు చేయాల్సిన పనులు అంటూ మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్‌వం విగ్రహాలను మార్చుకుంటూ పోతే ఎలా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వాడుకోవాలని సూచించారు కేసీఆర్. ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని సభ వేదికగా ప్రజలకు మరోసారి తెలియజేయాలని సూచించారు.
ఇది సవతి తల్లి: కేటీఆర్
కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ ఆవిష్కరించనున్నారు. కుడి చేతిలో తెలంగాణ ప్రజలకు అభయహస్తం అందిస్తున్నట్టు ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటలను ఉంచారు. తెలంగాణ ఆడబిడ్డల కట్టు, బొట్టు ఉట్టిపడేలా ప్రసన్న వదనంతో నిండైన రూపంలో విగ్రహాన్ని రూపొందించారు. ఇప్పటి వరకు ఉన్న విగ్రహంలో ఉన్న బతుకమ్మ ఇప్పుడు లేదు. అభయం ఇస్తున్నట్టు ఉన్న విగ్రహం కాంగ్రెస్ గుర్తులా ఉందని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. ఈ విగ్రహం సవతి తల్లి వంటిదని.. అసలైన తెలంగాణ విగ్రహం తమదేనంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలుగు తల్లి విగ్రహం, నగలు, కిరీటంతో ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం పేదరికంలో ఉంచాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
Also Read: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
పోటాపోటీగా విగ్రహావిష్కరణలు
సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వాన పత్రిక అందజేశారు. తాము కొత్త విగ్రహాన్ని తిరస్కరిస్తున్నామని తెలిసేలా ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ తల్లి ఫోటోనే అప్ డేట్ చేశారు. దీనికి పోటీగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్ల ఇప్పుడు ఉన్న విగ్రహాన్నే కేటీఆర్ ఆవిష్కరించనున్నారు.