(Source: ECI/ABP News/ABP Majha)
రాజకీయ ఒత్తిడితోనే ఈడీ ప్రశ్నిస్తోందని కవిత ఆరోపణ- నేడు మరోసారి విచారణ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మంగళవారం (మార్చి 21) ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేశారు.
ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) రెండోసారి సుదీర్ఘంగా విచారించింది. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు సుమారు 11 గంటల పాటు విచారించారు. మార్చి 20 ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్ ఆరోపణలతో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పటికే రెండుసార్లు విచారించింది.
తనను 11 గంటలు ప్రశ్నించిన అధికారులు కేవలం 14 ప్రశ్నల చుట్టే తిరుగుతున్నారని కవిత ఆరోపిస్తున్నట్టు సమాచారం. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నప్పటికీ కుట్ర జరుగుతోందన్నారు. సహాయ నిరాకరణ చేస్తున్నాను అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్న అనుమానం పడ్డారామె. ఇప్పటివరకు ఎవ్వరితో కూడా కన్ఫ్రంట్ చేయలేదన్నారు.
కేసులో తన పాత్ర ఉందని ఒక్క ఆధారాన్ని కూడా ఈడీ అధికారులు చూపించలేదని కవిత అన్నట్టు తెలుస్తోంది. ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడిలో భాగంగానే విచారిస్తున్నట్టు బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఇది కేవలం రాజకీయ కుట్ర అని అన్నారు. రాజకీయ ఒత్తిడితో ఈడి పారదర్శకత లోపించిందని ఇది రాజకీయ వేధింపుల్లో భాగమని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత. ఓ సందర్భంలో ఈడీ అధికారులపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారని కూడా చెబుతున్నారు. తాను అడిగిన ప్రశ్నలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నీళ్లు నమిలారని అంటున్నారు. కేవలం పొలిటికల్ లైన్ లో ప్రశ్నించినట్టు ఆరోపిస్తున్నారు. నన్ను నిందితురాలుగా పిలిచారా అని ఈడి ఆఫీసర్లను ప్రశ్నిస్తే... కాదు అని తడబడ్డారని చెప్పారు.
ప్రశ్నించడానికి పిలిచి ఎలాంటి కన్ఫ్రంటేషన్ చేయకుండా పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో విచారణ జరుగుతోందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. తాను విచారణకు సంపూర్ణగా సహకరిస్తున్నానని నొక్కిచెప్పారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా ఇంత తొందరగా విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గత విచారణలో స్వాధీనం చేసుకున్న తన ఫోన్ పూర్తిగా చెక్ చేసుకోవచ్చని అధికారులకు స్పష్టం చేశారట. తను ఫోను ధ్వంసం చేసినట్టు మీడియాకి లీకులు ఎవరు ఇచ్చారని కూడా ఈడి అధికారులను నిలదీశారని చెప్పారు. బిజెపిలో చేరగానే మరుగునపడ్డ కేసుల గురించి ప్రస్తావించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రశ్నలకు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. బీజేపీలో చేరాక మరుగున పడ్డ హిమంతా బిశ్వ శర్మ, సుజనా చౌదరి, నారాయణరాణే కేసులను ప్రస్తావించినట్టు సమాచారం. తాను ఈడి కార్యాలయానికి చేరుకున్న గంట వరకు అధికారులు రాలేదన్నారు. గంటలపాటు రూమ్‌లో ఒకరిని కూర్చోబెట్టి మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించారు. ఈడి అధికారుల విచారణలో పారదర్శకత లేదన్నారు కవిత.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మంగళవారం (మార్చి 21) ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేశారు. నిన్న ఆమెను ఈడీ అధికారులు 10 గంటలకుపైగా విచారించారు. డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార లావాదేవీలు, లిక్కర్ స్కా్మ్ లో సౌత్ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లారు. వైద్యులు కూడా ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఎమ్మెల్సీ కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చే ముందు కారు ఎక్కుతూ విక్టరీ సింబల్ చూపిస్తూ వెళ్లిపోయారు.