Kavitha vs Teenmar Mallanna: వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, కించపరిచేలా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు- MLC సభ్యత్వం రద్దుకు కవిత ఫిర్యాదు
తనను కించపరిచేలా, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫిర్యాదు చేశారు.

BRS MLC Kavitha | హైదరాబాద్: తనపై అసభ్య పదజాలం వాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సభ్యత్వాన్ని రద్దు చేయాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ లోని గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఫిర్యాదు లేఖ ఇచ్చారు కవిత. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై "కమిటీ ఆన్ ఎథిక్స్"కు రెఫర్ చేయాలని కోరారు. అనంతరం లా అండ్ ఆర్డర్ ఐజీ రమణ కుమార్ కు ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు లేఖలో ఏముందంటే..
‘శాసన మండలి సభ్యురాలినైన కల్వకుంట్ల కవిత అనే నాపై శాసన మండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గౌరవ చట్టసభలో సభ్యుడిగా ఉన్న మల్లన్న గారు ప్రజాప్రతినిధినైన నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని రెండేళ్లుగా నేను ఉద్యమిస్తున్నాను. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఢిల్లీ వేదికగా బీసీ గొంతుకగా నిలిచాను. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బలంగా గొంతు వినిపిస్తున్నాను.

బీసీ రిజర్వేషన్ బిల్లులు..
తెలంగాణ జాగృతి చేసిన ఉద్యమాలకు దిగివచ్చే రాష్ట్ర ప్రభుత్వం శాసన సభ, శాసన మండలిలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేర్వేరు బిల్లులు ప్రవేశ పెట్టి ఆమోదించింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చడానికి ఆలస్యమవుతుండటంతో ఢిల్లీ వేదికగా ఉద్యమం చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపైనా ఒత్తిడి తీసుకువచ్చాము. ఈ పోరాటాలు, ఉద్యమాల ఫలితంగానే రాష్ట్ర కేబినెట్ బీసీలకు చట్ట సభల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపింది.

నాపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు..
రాష్ట్ర కేబినెట్ బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించాము. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ సంబరాలపై స్పందిస్తూ నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చట్టసభలో సభ్యురాలినైనా నాపైనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటే సమాజంలోని సామాన్య మహిళల విషయంలో ఆయన ఎలాంటి భావనతో ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. తీన్మార్ మల్లన్న గారు నాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను శాసన మండలిలోని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలని Rule Number 262-C, Sub Rule 1 కింద కోరుతున్నాను’ అని ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పాటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్లకు సంబంధించిన పెన్ డ్రైవ్, ట్రాన్స్ క్రిప్ట్ కూడా అందజేసినట్లు తెలిపారు.
గన్ ఫైర్ చేసి చంపేస్తారా!
ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ లో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం. బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి. బీసీ రిజర్వేషన్ల అమలుకై తెలంగాణ జాగృతితో పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు బీసీ కాబట్టి ఏదీ పడితే అదీ మాట్లాడితే సరికాదు. తీన్మార్ మల్లన్న మీరు మాట్లాడిన మాటలకు మావాళ్ళకు కోపం వచ్చి నిరసన తెలిపారు. అంత మాత్రనికే గన్ ఫైర్ చేసి చంపేస్తారా! నేను ఊరుకునే ప్రసక్తే లేదు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే వెనకనుండి మీరు మాట్లాడించారని భావించాల్సి వస్తుంది.
ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి
24 గంటలు గడిచిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం.. వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు సెషన్స్ లేవు కాబట్టి. మీరు ఎథిక్స్ కమిటీకి పిర్యాదు చేయాలని మండలి ఛైర్మన్ సూచించారు. ఎమ్మెల్సీ మహిళా నేతపై చేసిన వ్యాఖ్యల్ని పట్టించుకోకపోతే.. సాధారణ మహిళల పరిస్థితి ఏంటీ? ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలని సీఎం, డీజీపీకీ రిక్వెస్ట్ చేస్తున్నాం.
వెంటనే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలి. తీన్మార్ మల్లన్న ఎవరు. ఎందుకు గోల గోల చేస్తున్నాడు’ అన్నారు.






















