KTR vs Revanth: టార్గెట్ రేవంత్ గా కేటీఆర్ మాస్టర్ ప్లాన్! 10 రోజుల పాటు బీఆర్ఎస్ రైతు సమావేశాలకు నిర్ణయం
Farmer Meetings in Telangana : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను క్యాష్ చేసుకునేందుకు బీఆర్ఎస్ భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. జులై 17 నుంచి 10 రోజుల పాటు రైతు సమావేశాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
Farmer Meetings in Telangana : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను క్యాష్ చేసుకునేందుకు బీఆర్ఎస్ భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. జులై 17 నుంచి 10 రోజుల పాటు బీఆర్ఎస్ రైతు సమావేశాలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం నిర్మించిన ప్రతి రైతు వేదిక వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు బీఆర్ఎస్ రైతు సమావేశాలను 3 పంటలు బీఆర్ఎస్ నినాదం - 3 గంటల కరెంట్ కాంగ్రెస్ విధానం పేరిట నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.
రైతులకు కేవలం 3 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారని, ఇది అన్నదాతలపై కక్షగట్టడమే అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమది రైతు ప్రభుత్వమని, అందుకే వారి కోసం పంట పెట్టుబడి కోసం రైతు బంధు ఇస్తున్నారు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. అయితే రైతులకు ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని.. అందుకు రైతులకు ఉచిత విద్యుత్ పై రేవంత్ వ్యాఖ్యలే నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. జులై 17 (సోమవారం) నుంచి బీఆర్ఎస్ నిర్వహించనున్న రైతు సమావేశాలు కాంగ్రెస్ నేతలు రైతులకు క్షమాపణ చెప్పేలా తీర్మానాలు చేయాలని సూచించారు.
కాంగ్రెస్ వి రైతు వ్యతిరేక విధానాలు అని, ఉదాహరణగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ మార్గనిర్దేశం చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేయడమంటే రైతులు ఉచిత విద్యుత్ ను వదులుకున్నట్లేనని రైతులకు చెప్పాలన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ వద్దన్న కాంగ్రెస్ పార్టీ దురాలోచనను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వెలుగులు నింపిన కేసీఆర్ ప్రభుత్వం కావాలో.. చీకట్లలో ఉంచే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా? రాష్ట్ర రైతులు తేల్చుకోవాలని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారిలా..
అమెరికాలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కొందరు నిపుణులు తెలంగాణ ప్రభుత్వ పాలసీలపై ప్రశ్నలు వేశారని, కాంగ్రెస్ పార్టీ విధివిధానాలను తాను స్పష్టంగా వారికి వివరించినట్లుగా చెప్పారు. తాను చెప్పిన సమాధానంలో కొంత భాగాన్ని కట్ చేసి ప్రచారం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ అతి తెలివి ప్రదర్శించి చిల్లర వ్యవహారం చేశారంటూ మండిపడ్డారు. ఉచితంగా ఇస్తున్న విద్యుత్‌పై మరోసారి చర్చ జరగడం మంచిదే అని అభిప్రాయపడ్డారు. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ అంశాన్ని కాంగ్రెస్ అప్పట్లోనే ప్రకటించిందని.. ఫ్రీ విద్యుత్తు ఇవ్వడం కుదరదని అప్పట్లో టీడీపీతో చెప్పించిన వ్యక్తి చంద్రశేఖర్ రావు అంటూ గుర్తు చేశారు. అప్పట్లో విద్యుత్ కోసం చేసిన పోరాటంలో రైతులను చంపిన పాపం ముమ్మాటికీ కేసీఆర్ కి తగులుతుందని రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘తాను వ్యవసాయం తెలిసిన వాడినని.. దుక్కి దున్నిన వాడినని అన్నారు. కేటీఆర్ అమెరికాలో బాత్‌రూంలు కడిగారని, ఆ పనులు తాను చేయలేదని అన్నారు. తాను పాస్ పోర్ట్ బ్రోకర్ కొడుకుని కూడా కాదని వ్యాఖ్యానించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial