Tirumala News: తిరుమలలో రథసప్తమికి ఘనంగా ఏర్పాట్లు - ఫిబ్రవరి 3 తర్వాత వెళ్లే భక్తులకు కీలక సూచనలు
Tirumala: తిరుమలలో రథసప్తమికి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ఫిబ్రవరి 3 - 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదు. సిఫారసు లేఖలు కూడా అనుమతించరు.

Rathasaptami in Tirumala: ఫిబ్రవరి 04న తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో జరగనున్న రథసప్తమిని నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్ర వారం అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరిలతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై ఈవో శ్యామలరావు సమావేశం నిర్వహించారు.
భక్తులు గ్యాలరీలోకి ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఈవో సూచించారు. గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. అనంతరం అధికారులతో కలిసి నాలుగు మాడ వీధుల్లో ఏర్పాట్లను టిటిడి ఈవో పరిశీలించారు.
భక్తులకు కీలక సమాచారం :
రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించనున్నారు.
ప్రతి సంవత్సరం శుక్ల పక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమిని ఘనంగా నిర్వహిస్తారు.
వాహనం వివరాలు:
ఉ. 5.30 - 8 గం.ల వరకు (సూర్యోదయం 6.44 AM) - సూర్య ప్రభ వాహనం
ఉ. 9 - 10 గంటల వరకు - చిన్న శేష వాహనం
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు - గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు - హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు - చక్రస్నానం
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు - చంద్రప్రభ వాహనం
రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు
అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. తిరుపతిలో ఫిబ్రవరి 3 - 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయరు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 03న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు. ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టిక్కెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు పంపిణీ, నిఘా మరియు భద్రత, శ్రీవారి సేవకులు, పుష్పాలంకరణ , విద్యుత్ అలంకరణలు, ఇంజనీరింగ్ పనులు తదితర అంశాలపై శాఖలవారీగా ఈవో అధికారులకు సూచనలు జారీ చేశారు.
Also Read: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి మొదలు.. భారీగా పెరిగిన రద్దీ, భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం!





















