KCR : నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ - విచారణలో ఏం చెబుతారో?
KCR :కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది.

KCR : తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన కాళేశ్వరం బ్యారేజీ కుంగుబాటులో నేడు విచారణకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు విచారణకు హాజరవుతారు. ఉదయం 8 గంటలకు ఫఆమ్‌హౌస్‌లో భారీ కాన్వాయ్‌తో బయల్దేరుతారు. ఈ వివాదంపై ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ను కమిషన్ ప్రశ్నించింది. ఇంజినీరింగ్ అధికారులను కూడా విచారించింది. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు కేసీఆర్‌ను ప్రశ్నించనుంది.
కాళేశ్వరం బ్యారేజీ పిల్లర్లు పగుళ్లు ఇవ్వడంపై గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇది పూర్తిగా ప్లానింగ్ లోపమని ప్రభుత్వం విమర్సిస్తుంటే వాటిని బీఆర్‌ఎస్ తిప్పికొడుతూ వస్తోంది. అసలు వాస్తవం తేల్చేందుకు ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసింది. అప్పటి నుంచి ఈ నిర్మాణంతో సంబంధం ఉన్న వారందర్నీ ఈ కమిషన్ పిలిచి విచారిస్తోంది. ఇప్పటి వరకు హాజరైన వారంతా ఇచ్చిన స్టేట్మెంట్స్‌ను కేసీఆర్ ఎదుట పెట్టి క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ చేయాలనే ఆలోచన మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు తీసుకున్నట్టు అంతా వాంగ్మూలం ఇచ్చారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనలను నాటి ఈఎన్‌సీ సి.మురళీధర్ 2016 ఫిబ్రవరి 18న ప్రతిపాదనలు పంపారు. దీన్ని ఆధారంగానే ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి ఓకే చెబుతూ 2016 మార్చి 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత అంటే 2016 మార్చి 15న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు అయిందని చెబుతున్నారు. ఇందులో నాటి మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు భాగమయ్యారు. దీనికి హరీష్‌ఛైర్మన్. ఇదే విషయాన్ని తుమ్మల స్పందించారు. మంత్రివర్గ ఉపసంఘం సూచనతోనే మేడిగడ్డ నిర్మాణం జరిగిందనేది అబద్దమన్నారు.
కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) లేఖల, వ్యాప్కోస్ నివేదిక, నాటి అధికారుల, మాజీ మంత్రుల వాంగ్మూలాలను కేసీఆర్ ముందు ఉంచబోతున్నారు. వాటి ఆధారంగా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్‌ను కేసీఆర్‌కు అడగాలని నిర్ణయించారు. ఎవరి సూచనలు లేకుండానే కాళేశ్వరం కట్టిపడేశారనే ప్రభుత్వం ఆరోపిస్తోంది. జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ కూడా ఇదే విషయంపై డ్రిల్ చేస్తోంది. ఇప్పుడు కేసీఆర్‌ను ఎలాంటి ప్రశ్నలు వేయనుంది. కేసీఆర్ చెప్పే సమాధానాలతో కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందనే ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది.
ఇప్పుడు కేసీఆర్ హాజరై వస్తే ఇలాంటి కమిషన్లు ముందు హాజరైన రెండో మాజీ సీఎంగా నిలవనున్నారు కేసీఆర్. గతంలో చంద్రబాబు కూడా ఏలేరు భూకుంభకోణంపై విచారణకు హాజరయ్యారు. కమిషన్ ఏం అడుగుతుంది, ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనే విషయాలపై హరీష్‌రావుతో ఇప్పటికే చర్చించారు. పలు దపాలు ఇద్దరి మధ్య సమావేశాలు జరిగాయి. కమిషన్‌కు ఇచ్చేందుకు ఓ నివేదిక కూడా సిద్ధం చేసినట్టు బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైత పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
ఉదయం 8 గంటలకు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ బయల్దేరనున్నారు. అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో జరిగే విచారణకు హాజరవుతారు. కేసీఆర్‌ను రాజకీయ కుట్రలో భాగంగా విచారణకు పిలిచారని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్ విచారణ జరిగే ప్రాంతానికి భారీగా తరలి వస్తున్నారు. ఆయన వచ్చేటప్పుడు రోడ్డుకు ఇరువైపుల ఉండి మద్దతు తెలిపే ప్రయత్నాల్లో ఉన్నారు. విచారణ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉందని అంటున్నారు.





















