Telangana : అమృత్ పథకం నిధులకు రేవంత్ సర్కారు టెండర్- సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేస్తామన్న బీజేపీ
Revanth Reddy: అమృత్ పథకం నిధులు సహా ఏడు నెలల్లో జరిగిన అక్రమాలపై రేవంత్ రెడ్డి విచారణకు సిద్ధపడాలని సవాల్ చేసింది బీజేపీ. సొంత కుటుంబ సభ్యులతోపాటు మెగా సంస్థలకు పనులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
BJP Vs Congress About Amrit Scheme Funds: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ పథకం ద్వారా వచ్చిన నిధులకు రేవంత్ రెడ్డి సర్కారు టెండర్ వేసిందని అక్రమంగా నిధులు కాజేసే పనిలో బిజీగా ఉందని బీజేపీ నేతల సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్‌లో మీడియాతో మాట్లాడిన బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన 3 వేల కోట్ల రూపాయల నిధులనుదారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శోధ, గజా, కేఎన్‌ఆర్ కంపెనీలకు కాంట్రాక్టు పనులు అప్పగించారని అన్నారు. రేవంత్ బావమరిది సుజన్ 400 కోట్ల రూపాయల పనులు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ పనుల్లోనే మెగా కృష్ణారెడ్డికి 11 వందల కోట్ల రూపాయల పనులు అప్పగించారని అన్నారు మహేశ్వర్ రెడ్డి. ఎస్టిమెట్లు అన్ని కాంట్రాక్టర్లు తయారు చేసుకొన్నారని ఆరోపించారు. 600 కోట్లతో అయ్యే పనికి వెయ్యి కోట్ల రూపాయలుగా ఎస్టిమెట్లు తయారు చేశారని విమర్శించారు. కాంట్రాక్టర్లు 30 నుంచి 35 శాతం లెస్ వేసి కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకున్నారంటే అర్థం చేసుకోవచ్చని కానీ ఇలా జరగం వెనుక భారీ కుంభకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ఇన్ని పనులు అప్పగించిన ప్రభుత్వం ఒక్క జీవో పబ్లిక్ డొమైన్ పెట్టడం లేదని అన్నారు మహేశ్వర్ రెడ్డి. టెండర్ డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేశారని దుమ్మెత్తి పోశారు.
ఈ పనుల విషయంలో రేవంత్ రెడ్డి తమ్ముడు, బావమరిది ఇన్వాల్వ్ అయ్యారన్నారు మహేశ్వర్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక వైపు జ్యుడిషియల్ విచారణ జరుగుతుంటే అదే మెగా కృష్ణారెడ్డికి 11 వందల కోట్ల రూపాయల పనులు ఎలా అప్పగించారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు.
ఏడు నెలల్లో చేసిన చీకటి ఒప్పందాలకు, టెండర్లకు ప్రభుత్వం సిద్ధపడుతుందా అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. హెట్రో డ్రగ్స్ భూమి విషయంలోనూ, సివిల్ సప్లై అవినీతిపై విచారణకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. కొడంగల్ ప్రాజెక్టును కూడా మెగా కృష్ణారెడ్డి కే అప్పగించబోతున్నారని అన్నారు. తెలంగాణలో చీకటి కోణంలో చీకటి పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధుల దుర్వినియోగం పై సీబీఐ, ఈడీ విచారణ చేయాలని కోరుతామని అన్నారు.