Telangana News: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్? పరిశీలిస్తున్న అధినాయకత్వం!
Eatala Rajender:

Telangana BJP President: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రి పదవి వరించిది. మోడీ క్యాబినెట్‌లో వరుసగా రెండోసారి చోటు లభించింది. ఇప్పటి వరకు రెండు పదవులు నిర్వహిస్తు వస్తున్న కిషన్ రెడ్డి ఇకపై ఒకటే పదవిలో కొనసాగనున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ సారథి ఎవరూ అనే ప్రశ్న గట్టిగానే వినిపిస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ బాగానే ఓట్లు, సీట్లు రాబట్టుకుంది. అధికార పార్టీ కాంగ్రెస్‌తో సమానంగా సీట్లు సాధించింది. 17 సీట్లు తెలంగాణలో ఉంటే అందులో ఎనిమిదింటిని బీజేపీ గెలుకుంది. అందుకే సంస్థాగతంగా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేస్తే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగలమనే ధీమాను నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చేపట్టబోయే మార్పులు ఆ దిశగానే ఉంటాయని అంటున్నారు.
తెలంగాణలో సగం ఎంపీ స్థానాలు కైవశం చేసుకొని జోష్ మీద ఉన్న బీజేపీ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే మల్కాజ్‌గిరి ఎంపీ అయిన ఈటల రాజేందర్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన కచ్చితంగా కేంద్రమంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరిగింది. ఉన్న సమీకరణాలతో అది సాధ్య పడలేదు. అందుకే ఆయన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని చేస్తారనే ప్రచారం ప్రారంభమైంది.
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదంతో వెళ్లిన బీజేపీ మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. అయితే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ప్రజల ఆశీర్వాదం పొందింది. దీంతో అప్పట్లో ప్రచారం చేసినట్టుగానే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది. దీంతోపాటు కమిట్మెంట్‌తో ఉన్న నేతలకు గుర్తింపు ఉంటుందని కూడా రెండు మంత్రిపదవులు ఇచ్చి చెప్పకనే చెప్పారు.
మిగతా నేతలకి కూడా కీలకమైన పదవులు ఇచ్చి మరింత మందిని ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం పూర్తైన వెంటనే వివిధ రాష్ట్రాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ పాత్ర మరింత దూకుడుగా ఉంటుందని అంటున్నారు. అలాంటి నేతలకే పగ్గాలు అప్పగించనున్నారని టాక్ నడుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

