Bhatti Vikramarka: ప్రభుత్వ భూములు అయిపోగానే, ప్రజల ఆస్తులు కూడా వేలం! : భట్టి విక్రమార్క సెటైర్
Bhatti Vikramarka: హైదరాబాద్ లో గానీ చుట్టు పక్క ప్రాంతాల్లో కానీ ప్రభుత్వ రంగ భూములు ఉండవని.. అన్నింటినీ బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.
Bhatti Vikramarka: రాష్ట్రంలో హైదరాబాద్ లోగానీ, పరిసర ప్రాంతాల్లో గానీ భవిష్యత్తులో ప్రభుత్వరంగ భూములు అనేవి ఉండవని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ రంగ ఆస్తులు, భూములతో పాటు బీఆర్ఎస్ నేతలు అన్నింటినీ అమ్మేస్తారని అన్నారు. ఆ తర్వాత గత ప్రభుత్వాలు పేద ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములపై పడతారని, అవి కూడా అమ్ముడుపోయాక... చివరకు ప్రజల ఆస్తులను కూడా అమ్మకానికి పెడతారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకాన్ని బీఆర్ఎస్ సర్కారు ఓ ఉద్యమంలో చేపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇప్పుడు వేల ఎకరాలు అమ్ముతున్నారని అన్నారు. ప్రజలకు చెందిన భూమిని ఇష్టానుసారంగా వినియోగించుకోవడానికి వారికి ఏం హక్కు ఉందంటూ ప్రశ్నించారు.
ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాల నిలబడుతుందని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ఆస్తుల అమ్మకానికి తాము వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు. అదే విధంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ఎజెండా ఏంటో ముందే చెప్పకుండా అప్పటికప్పుడు చెబితే ఎలా అంటూ నిలదీశారు. చర్చ లేకుండా వాళ్ల ప్రచారం కోసమే సభ పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రశ్నోత్తరాలలో తమకు సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ అధికార పార్టీ సభ్యులకు మాత్రమే అవకాశం ఇస్తున్నారని విమర్శించారు.
మీ BRS పాలనలో ముందు చూపు లేకుండా సాగునీటి ప్రాజెక్ట్ లు కట్టారు అవి ముంపు కు గురైతున్నయి
— Bhatti Vikramarka Mallu (@BhattiCLP) August 4, 2023
కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సాగునీరు అందిస్తున్నాయి
#TelanganaAssembly pic.twitter.com/9N9qNzMUbd
ఇటీవలే బీఆర్ఎస్, బీజేపీలపై ఫైర్ అయిన భట్టి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీభవన్‌లో అసంఘటిత కార్మిక, ఉద్యోగులతో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కార్మికుల అవసరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. కార్మికులు, ఉద్యోగుల హక్కులను బీజేపీ, బీఆర్ఎస్ నిర్వీర్యం చేస్తున్నాయంటూ మండిపడ్డారు.
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కార్మికుల సంక్షేమం కోసం కనీస వేతన చట్టాన్ని తీసుకువచ్చామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో ఏర్పాటైన రాష్ట్రం తెలంగాణలో ఏదీ సరిగ్గా లేదన్నారు. కేసీఆర్ 9 ఏళ్లుగా సీఎంగా ఉన్నా.. కనీస వేతన బోర్డును సమీక్ష చేయకుండా నిర్లక్ష్యం చేశారని చెప్పారు. పర్మినెంట్ ఉద్యోగులు మాత్రమే ఉంటారు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం ఉండదని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు జాబ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలతో కార్మికులు శ్రమ దోపిడీకి గురయ్యారని అభిప్రాయపడ్డారు. కార్మికులు ఇకనైనా తమ హక్కుల కోసం, న్యాయపరమైన వేతనాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. నిర్మాణ సంస్థలు చెల్లించే సెస్ ను కార్మికల కోసం ఖర్చుపెట్టకుండా పక్కదారి పట్టిస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సెక్రెటరీ మన్సూర్ అలీఖాన్, కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.