Bandi Sanjay: బావ కళ్లల్లో ఆనందం కోసమే కొత్త సెక్రెటేరియట్, BJP వస్తే ఆ డోమ్‌లు కూల్చేస్తాం: బండి సంజయ్
తాజ్ మహాల్ ఒక సహాధి అని, సమాధి తరహాలో సచివాలయం నిర్మించడం ఏంటని బండి సంజయ్ దుయ్యబట్టారు.
హైదరాబాద్‌లో తెలంగాణ కొత్త సచివాలయ భవన నిర్మాణ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన విమర్శలు చేశారు. సచివాలయ నిర్మాణం భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా లేదని అన్నారు. సచివాలయంలో మళ్లీ మార్పులు చేస్తామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయ డోమ్‌లు (గుమ్మటాలను) కూల్చేస్తామని చెప్పారు. సచివాలయం తాజ్ మహాల్‌ను స్ఫూర్తిగా తీసుకొని నిర్మించినట్లుగా ఉందని చెప్పారు. తాజ్ మహాల్ ఒక సహాధి అని, సమాధి తరహాలో సచివాలయం నిర్మించడం ఏంటని దుయ్యబట్టారు. మొన్న ఏఐఎంఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా సచివాలయం అద్భుతం అని కొనియాడారని బండి సంజయ్ గుర్తు చేశారు. అదేదో సినిమాలో బావ కళ్లలో ఆనందం కోసం చేశానన్నట్లుగా, ఒవైసీ కళ్లలో ఆనందం కోసం సీఎం కేసీఆర్ తాజ్ మహాల్ తరహాలో సచివాలయం నిర్మాణం చేశారని అన్నారు.
మంత్రి కేటీఆర్ కు దమ్ముంటే ఓల్డ్ సిటీలో రోడ్ పక్కన ఉన్న గుళ్ళు, మసీదు లు కుల్చటం మొదలు పెట్టాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతిని, కుటుంబ పాలనను ప్రజల్లోకి కార్నర్ మీటింగ్ ల ద్వారా తీసుకువెళ్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో కేసీఆర్ లేడని.. ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని, ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు కూడా ఇవ్వట్లేదని అన్నారు.
హైదరాబాద్‌లో అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. 60 శాతం నిధులు ఇస్తున్న హైదరాబాద్‌ను ఏ రకంగా అభివృద్ధి చేశారో కేసీఆర్ ప్రజలకు చెప్పాలని అన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వలేదని కేంద్ర పైన ఆసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి అవాస్ యోజన పథకాన్ని, ఫసల్ బీమా యోజన పథకాన్ని కేసీఆర్ అమలు చేయడం లేదని బండి సంజయ్ విమర్శించారు.