బీఆర్‌ఎస్‌పై బండి, షర్మిల సెటైర్లు- ఆదిపురుష్‌గా అభివర్ణించిన ఆర్జీవీ
కేసీఆర్ జాతీయ పార్టీపై బండి సంజయ్ చాలా వ్యంగ్యంగా స్పందించారు. దర్శకుడు ఆర్జీవీ మాత్రం ఆకాశానికి ఎత్తేశారు.
భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావం, సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారడం అనేది పందికి లిప్‌స్టిక్ పూసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తాము చేయబోయే కార్యక్రమాలు గేమ్ చేంజర్ అని కేటీఆర్ చెబుతుంటే... కేసీఆర్ మాత్రం నేమ్ చేంజర్ అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతిమంగా ప్రజలే ఫేట్ ఛేంజర్స్ అని సెటైర్లు వేశారు.
TRS to BRS is like "Putting lipstick on a pig".#TwitterTillu Claimed to be Game Changers...
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 5, 2022
But father became a Name Changer.
People are the ultimate Fate Changers !!
ముఖ్యమంత్రి కేసీఅర్ జాతీయ పార్టీ పై వైఎస్ షర్మిల కూడా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రాన్ని ఉద్దరిస్తారని పట్టం కడితే.. ఉన్నది తిన్నావ్.. తెచ్చినది తిన్నావ్... బంగారు తునక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావ్ అని విమర్శలు చేశారు. రైతులు, నిరుద్యోగులు సచ్చేలా చేశావ్ అని ఆరోపణలు చేశారు. వ్యతిరేకతను దాచిపెడుతూ.. తోడు దొంగలను కలుపుకొని... దేశం నాకు పట్టం కడుతుందని.. పగటి కలలు కంటున్నావని ఆక్షేపించారు. దోచుకున్న సొమ్ముతో విమానాలు కొంటూ.. స్వలాభం, స్వార్థం కోసం టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. గూట్లో రాయి తీయడమే చేతకాని కేసీఆర్ ఏట్లో రాయి తీస్తారా అని ప్రశ్నించారు. ఇక్కడ పరిపాలనే చేతకాని కేసీఆర్ దేశాన్ని ఉద్దరిస్తారా అని నిలదీశారు. రాష్ట్ర ప్రజలను పట్టించుకోని కేసీఆర్ దేశం ఎలా పట్టం కడుతుందని క్వశ్చన్ చేశారు. ఆశకు హద్దు లేదని... కేసీఆర్‌కు ఆలోచనకు అవకాశం కూడా లేదన్నారు.
రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడని పట్టం కడితే.. ఉన్నది తిన్నవ్.. తెచ్చినది తిన్నవ్..బంగారు తునక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావ్. రైతులు, నిరుద్యోగులు సచ్చేలా చేశావ్. వ్యతిరేకతను దాచిపెడుతూ.. తోడు దొంగలను కలుపుకొని.. దేశం నాకు పట్టం కడుతుందని.. పగటి కలలు కంటూ.. దోచుకున్న సొమ్ముతో
— YS Sharmila (@realyssharmila) October 5, 2022
1/3
మూడు జాతీయ పార్టీలన్నీ ఒక వైపు ఉంటే... వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ఇంకో వైపు ఉందన్నారు. తెలంగాణ ప్రజల తరుఫున పోరాడుతున్న ఏకైక ప్రాంతీయ పార్టీ వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమేనని అన్నారు. మాట మీద నిలబడే నాయకత్వం కోసం, మళ్లీ వైఎస్ సంక్షేమ పాలన తీసుకురావడం కోసం తమ పార్టీ పని చేస్తుందన్నారు.
సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా పేరున్న ఆర్జీవీ కూడా బీఆర్‌ఎస్‌పై స్పందించారు. కేసీఆర్ ఆదిపురుష్ అంటూ ట్వీట్ చేశారు. జాతీయరాజకీయాల్లోకి కేసీఆర్ రావడాన్ని ఆయన స్వాగతించారు.
By Making TRS into BRS , KCR became the AdiPurush (1stMan) to do it ..Welcome to NATIONAL POLITICS 💐
— Ram Gopal Varma (@RGVzoomin) October 5, 2022