TS Secretariat: భాగ్యనగర కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా సచివాలయం!
సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లుఅట్టహాసంగా జరపడానికి రేయింబవళ్లు అధికారుల కృషి
TS Secretariat- ఈనెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు అధికారులు, R&B అధికారులతో కలిసి సభ ప్రాంగణం, పార్కింగ్ ఏరియా తదితర ఏర్పాట్ల పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా శాఖల ఉద్యోగుల సీటింగ్, వారికి కేటాయించిన పార్కింగ్, తదితర ఏర్పాట్లపై ఈ మంత్రి చర్చించారు. సెక్రటేరియట్ లైటింగ్, సుందరీకరణ పనులపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను మంత్రి అదేశించారు. ప్రధాన భవనం ఇరువైపులా గ్రీనరీ లాన్స్, వాటర్ ఫౌంటెయిన్స్ చూపరులను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన పూలమొక్కలు నాటే పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి వేముల అదేశించారు. అధికారులు, పోలీసుల సమన్వయంతో సచివాలయ ప్రారంభోత్సవ వేడుక అట్టహాసంగా జరిగేలా చూడాలని సూచించారు.
శుక్రవారంలోగా ఫైళ్లన్నీ షిఫ్ట్
నూతన సచివాలయం ఈనెల 30న ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ రోజు నుంచే కొత్త సచివాలయంలో పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని శాఖలు తమకు కేటాయించిన గదులకు సామగ్రిని శుక్రవారం లోగా తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. షిఫ్టింగ్ చేయాల్సిన సమయాన్ని కూడా అధికారులు నిర్ధారించారు. ఒక్కో అంతస్తులో మూడు శాఖల కార్యాలయాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఫైళ్లు, కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్లు తదితర వాటిని కేర్‌ఫుల్‌గా తరలించాలని సూచించారు. ముఖ్యమైన ఫైళ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఫైళ్లకు ఆయా శాఖల ఉద్యోగులు, అధికారులదే పూర్తి బాధ్యతని స్పష్టం చేశారు.
ఏ అంతస్తులో ఏ శాఖ కొలువుదీరుతుంది?
గ్రౌండ్ ఫ్లోర్‌ని ఎస్సీ అభివృద్ధి, రెవెన్యూ శాఖకు కేటాయించారు. మొదటి అంతస్తులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ కొలువుదీరుతుంది. రెండో ఫ్లోర్లో ఫైనాన్స్, ప్లానింగ్ ,వాణిజ్య పన్నుల శాఖలుంటాయి. మూడో అంతస్తుని మున్సిపల్, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖలకు కేటాయించారు. ఫోర్త్ ఫ్లోర్లో నీటిపారుదల, అటవీశాఖ, పర్యావరణం ,దేవాదాయ శాఖలు ఉంటాయి. ఐదో అంతస్తులో రవాణ, రోడ్లు భవనాలు, సాధారణ పరిపాలన శాఖలు కొలువుదీరుతాయి. ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి పేషీ ఉంటుంది. సీఎస్, సీఎంవో అధికారులు కూడా అక్కడే ఉంటారు.
ఏ ఫ్లోరుకి వెళ్లినా గాలి, వెలుతురు ధారాళంగా
నూతన సచివాలయాన్ని గ్రీన్ కాన్సెప్ట్ విధానంలో డిజైన్ చేశారు. ఏ ఫ్లోరుకి వెళ్లినా గాలి, వెలుతురు ధారాళంగా వస్తుంది. చుట్టూ గదులు, మధ్యలో ఖాళీ స్థలం ఉంచారు. మొత్తం 8 ఎకరాల స్థలాన్ని పచ్చదనం కోసం కేటాయించారు. భవనానికి నలువైపులా వెడల్పైన మెట్ల దారి ఉంటుంది. దాంతో పాటు భారీ లిఫ్టులను ఏర్పాటు చేశారు. ఏమైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే కిందకు చేరుకునేలా ఇవి పనిచేస్తాయి. ఫైర్ సేఫ్టీ వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంది. షార్ట్ సర్క్యూట్ అన్నమాటే తలెత్తదు. ఎలాంటి అగ్ని ప్రమాదాలకు తావులేదు. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎక్కడికక్కడ నిలిపివేసేలా ఏర్పాట్లు చేశారు. సుమారు రూ. 617 కోట్ల అంచనా వ్యయంతో, అత్యాధునిక హంగులతో కూడిన భవన సముదాయాన్ని నాలుగేండ్లలోపే పూర్తిచేసి, ప్రారంభానికి సిద్ధం చేశారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ ఈ సచివాలయాన్ని నిర్మించింది.