అమెరికా కాల్పుల దుర్ఘటనలో తెలుగమ్మాయి ఐశ్వర్య మృతి
శనివారం టెక్సాస్‌లోని ఆలెన్ నగరంలో రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో తెలుగు అమ్మాయి ఐశ్వర్య మృతి చెందారు.
అమెరికాలో మరోసారి కాల్పులకు దుండగులు తెగబడ్డారు. ఈసారి జరిగిన కాల్పుల్లో తెలుగు అమ్మాయి మృతి చెందారు. టెక్సాస్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రంగారెడ్డి జిల్లా జడ్జి కుమార్తె మృతి చెందారు.
రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కుమార్తె ఐశ్వర్య అమెరికాలో పని చేస్తున్నారు. ఫర్‌ఫెక్ట్ జనరల్ కంట్రాక్ట్స్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా వర్క్ చేస్తున్నారు. మొన్న రాత్రి టెక్సాస్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 27 ఐశ్వర్య మృతి చెందినట్టు ఎఫ్‌బీఐ ధ్రువీకరించింది.
శనివారం టెక్సాస్‌లోని ఆలెన్ నగరంలో రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 9మంది చనిపోయారు. తెలుగు అమ్మాయి ఐశ్వర్య ఉన్నారు. ఈ కాల్పుల్లో చిన్నారి సహా మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దుండగుణ్ని కాల్చి చంపేశారు. స్పాట్‌లోనే ఏడుగురు చనిపోయారని... మరో ఇద్దరు ఆసుపత్రిలో చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఈ కాల్పులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
దుండగుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది మాటలకు అందని విషాదమని టెక్సాస్ గవర్నర్ ప్రకటించారు. బాధితులకు సాయం అందించేందుకు అదికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో అమెరికాలో తుపాకీ మోత సర్వసాధారణమైపోయింది. గన్ వయలెన్స్ ఆర్కైవ్ ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు అమెరికాలో 195కు పైగా కాల్పులు జరిగాయి.
కారు నుంచి కాల్పులు..
మాల్ వెలుపల నల్ల దుస్తులు ధరించిన దుండగుడు తుపాకీతో కారులో నుంచి దిగి కారు డోర్ వెనుక నుంచి షాపుల వెలుపల ఉన్న వారిపై కాల్పులు ప్రారంభించాడు. పక్కనే ఉన్న పార్కింగ్ స్థలంలో ఉన్న ఓ కారు రైడర్ ఈ మొత్తం ఘటనను షూట్ చేశాడు. ఈ వీడియోలో పలు రౌండ్ల బుల్లెట్లు కాల్చిన సౌండ్ వినిపించింది.