Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో దారుణం, మహిళా డాక్టర్‌పై దాడి!
Hyderabad News: ఓ వ్యక్తి జూనియర్ వైద్యురాలితో అనుచితంగా ప్రవర్తించాడు. ఎమర్జెన్సీ వార్డులో రోగులకు చికిత్స అందించేందుకు వచ్చిన మహిళా సర్జన్‌పై అందరూ చూస్తుండగానే దాడి చేశాడు.
Gandhi hospital: ఇటీవల కాలంలో దేశంలో ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట డాక్టర్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కోల్‌కతా వైద్యురాలిపై అఘాయిత్యం ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతుండగానే.. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి జూనియర్ వైద్యురాలితో అనుచితంగా ప్రవర్తించాడు. ఎమర్జెన్సీ వార్డులో రోగులకు చికిత్స అందించేందుకు వచ్చిన మహిళా సర్జన్‌పై అందరూ చూస్తుండగానే దాడి చేశాడు.
మద్యం మత్తులో దాడి
చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మానసిక పరిస్థితి బాగాలేని ప్రకాష్ (60) అనే వ్యక్తి ఎమర్జెన్సీ వార్డులో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్ పై దాడికి యత్నించాడు. డాక్టర్ అప్రాన్ లాగి, దాడి చేయడంతో అతడి బారి నుంచి ఇతర సిబ్బంది డాక్టర్‌ను కాపాడారు. బుధవారం (సెప్టెంబర్ 11) మధ్యాహ్నం 3.42 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. డాక్టర్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ఆపి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు గాంధీ ఆస్పత్రికి చేరుకుని, దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి జరిగిన సమయంలో ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని, మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు నిర్ధారించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో నిందితుడు తనతో పాటు ఉన్న ఓ మహిళ చేయి పట్టుకొని నిలబడి ఉన్నాడు. మరో రోగిని పరిశీలించేందుకు డాక్టర్ వెళ్తున్న క్రమంలో ఆమె అనుకోకుండా అతడి చేతిని తాకినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. ఇంతలో అతడు డాక్టర్ వేసుకున్న ఆప్రాన్ లాగుతూ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వైద్యురాలి అప్రాన్ చిరిగిపోయినట్లు వీడియోలో చూడవచ్చు. నిందితుడిని బన్సీలాల్‌పేటకు చెందిన ప్రకాష్‌గా గుర్తించారు.
ఆందోళనకు సిద్ధమవుతున్న జుడాలు
అనంతరం అతడిని చిలకలగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. గాంధీ ఆస్పత్రిలోని క్యాజువాలిటీ విభాగంలో మహిళా వైద్యురాలిపై మద్యం మత్తులో దాడి చేయడం నేరమన్నారు. ఈ ఘటనపై గాంధీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జూడాలు డిమాండ్ చేశారు. రోగి సహాయకుడు దాడికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆసుపత్రుల్లో వైద్యుల భద్రతపై గత నెల 10 రోజులు జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. ఆగస్టు 23న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.