Viral News: కొడుకును కాపాడుకునేందుకు తల్లడిల్లిన కన్నపేగు, కంటతడి పెట్టిస్తున్న ఘటన
Hyderabad News | వర్షపు నీటిలో ఉన్న కుమారుడ్ని కాపాడేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. కానీ ఆమె ప్రయత్నాలు ఫలించక కుమారుడు చనిపోయాడు.

మేడ్చల్: ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డితో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం నుంచి వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో జరిగిన ఓ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. వర్షపు నీటిలో ఉన్న కొడుకు ప్రాణాన్ని కాపాడేందుకు ఓ వృద్ధురాలు చేసిన ప్రయత్నం విఫలయత్నంగా మారింది. రెక్కాడితే గాని డొక్కాడని ఓ పేద కుటుంబంలో రెండు గంటలసేపు కురిసిన వర్షం ఓ తల్లికి కడుపు కోత మిగిల్చింది.
అసలేం జరిగిందంటే..
కుత్బుల్లాపూర్ లో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఆ వర్షం ఓ పేదింటి కుటుంబంలో విషాదం మిగిల్చింది. సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ లాస్ట్ బస్ స్టాప్ వద్ద కృష్ణవేణి అనే మహిళ ఇంటిలోకి వర్షపు నీరు చేరింది. అదే సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆమె కుమారుడు పద్మారావు మద్యం మత్తులో ఉన్నాడు. ఇంట్లోకి వర్షం నీరు ఎక్కువ వస్తుండటంతో ఆమె కొడుకును కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఆ వయసులో తనకు చేత కాకపోయినా కడుపు తీపితో కుమారుడు పద్మారావును కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నం స్థానికులతో పాటు ఆ దృశ్యాలు చూసిన వారిని సైతం కంటతడి పెట్టిస్తోంది.
వర్షపు నీటిలో పడి ఉన్న కుమారుడ్ని అతికష్టం మీద ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చింది. అసలేం జరిగిందో గమనిస్తూ, ఆమె ప్రయత్నాన్ని చూసిన ఇరుగు పొరుగువారు ఆ తల్లికి తోడ్పాటు అందించడానికి బదులుగా.. వీడియోలు తీస్తూ మానవత్వాన్ని మంటగలిపారు. అయినా కుమారుడి మీద ప్రేమ, కడుపు తీపితో వర్షపు నీటి నుంచి కొడుకు పద్మారావు ప్రాణాలు కాపాడేందుకు పెద్దావిడ తీవ్రంగా ప్రయత్నించింది. ఎలాగోలా కొడుకును ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చింది. కానీ చివరకు పద్మారావు మృతిచెందారు. అసలే మద్యం మత్తులో ఉన్న పద్మారావు వర్షపు నీళ్లు మింగాడో.. లేక ఇంకా ఏదైనా ఇబ్బంది తలెత్తిందో కానీ నిమిషాల వ్యవధిలో మృతి చెందాడు. కడుపు తీపిని కాపాడుకునేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నం విఫలయత్నంగా మారి కడుపు కోతను మిగిల్చింది. కుమారుడి ప్రాణాలు కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నాన్ని స్థానికులు వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ గా మారాయి.






















