Konaseema Tragedy News: గోదావరి తీరం శోక సంద్రం.. ఏడుగురి మృతదేహాలు లభ్యం..
Konaseema Tragedy News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం గౌతమి నదీపాయలో చోటుచేసుకున్న విషాద ఘటనలో గల్లంతైన ఎనిమిది మంది యువకుల్లో ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

Konaseema Tragedy News: గోదావరి తీరం శోక సంద్రం అయ్యింది.. ఎంతో బంగారు భవిత ఉన్న తమ బిడ్డలు ఇలా మృత్యువాత పడతారని కలలోనైనా ఊహించని ఆ కుటుంబాలు రోదన మిన్నంటింది. బిడ్డా ఎక్కడైనా క్షేమంగా ఉంటే ఏదోలా మాదగ్గరకు వచ్చేయరా అంటూ కన్నవారి కన్నీటి రోదన కన్నీళ్లు పెట్టిస్తోంది. వేసవి తాపం నుంచి తట్టుకునేందుకు సరదాగా ఈతకొడదామని గౌతమీ నదీపాయలో స్నానంచేసేందుకు వెళ్లి గల్లంతైన యువకుల్లో ఏడుగురు మృతదేహాలు మంగళవారం లభ్యం అయ్యాయి.. ఈ దుర్ఘటన సోమవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. గల్లంతైన వారి మృతదేహాలు వెలికితీసేందుకు చీకటి తీవ్ర అటంకంగా మారగా మంగళవారం ఉదయం నుంచే పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రత్యేక బోట్లు ద్వారా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డ్రోన్లు సాయంతో కూడా పోలీసులు మృతదేహాల ఆచూకీకోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అమలాపురం, రామచంద్రపురం ఆర్డీవోలు కె.మాధవి, డి.అఖిల, అమలాపురం డీఎస్పీ టీఎస్‌కే ప్రసాద్‌ల పర్యవేక్షణలో పోలీసు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గజ ఈతగాళ్ల సాయంతో బోట్లు ద్వారా మృతదేహాల గాలింపు చర్యలు నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో వడ్డి రాజేష్ మృతదేహం లభ్యం అయ్యింది.. ఆ తరువాత తీవ్ర గాలింపు చర్యలు చేపడుతున్న నేపధ్యంలోనే ఏడు మృతదేహాలు లభ్యం అయ్యాయి. మొత్తం ఏడుగురు మృతదేహాలు లభ్యం కాగా కాకినాడ జగన్నాధపురానికి చెందిన సబ్బతి క్రాంతి కిరణ్ మృతదేహం లభ్యం కాలేదు. ఒక్క మృతదేహం కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు.
కన్నీరు మున్నీరయిన కన్నవారు..
స్నేహితుని ఇంట శుభకార్యానికి వెళ్లి వస్తామని చెప్పి వెళ్లిన తమ బిడ్డలు చివరకు విగత జీవులుగా మారతారని అనుకోలేదని మృతదేహాలకోసం ఎదురు చూస్తున్న కన్నవారు, కుటుంబికులు కన్నీరు మున్నీరయ్యారు. వారి రోదనలతో గౌతమీ గోదావరి తీరం అంతా విషాదం నిండుకుంది. గోదావరి గర్భంలో నుంచి ఒక్కొక్క మృతదేహం బయటకు తెస్తున్న క్రమంలో విగతజీవిగా పడిఉన్న తమ బిడ్డను చూసి గుండెలవిసేలా రోదిస్తున్న తీరుకు అక్కడున్నవారు కన్నీటిపర్యంతమయ్యారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాల అప్పగింత..
గోదావరిలో మునిగి గల్లంతైన ఎనిమిది మంది యువకుల్లో బుధవారం సాయంత్రం నాటికి ఏడుగురి మృతదేహాలు లభ్యం కాగా ఎప్పటికప్పుడు అంబులెన్స్‌లో ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు. అక్కడ పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాలను వారి కుటుంబికులకు అప్పగించారు.
యువకుల సొంతగ్రామాల్లో అలముకున్న విషాదం..
గోదావరిలో సరదాగా స్నానానికి దిగి మృత్యువాత పడిన యువకులు కాకినాడ, మండపేట, ఐ.పోలవరం, శెరులంక ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించిన అధికారులు లభ్యం అయిన ఏడుగురు మృతదేహాలను వారి కుటుంబికులకు అప్పగించారు. కులపాక రోహిత్(19) స్వగ్రామం మండపేట మండలం ఆర్తమూరు కాగా ఈ యువకుని తల్లిదండ్రులు చిన్నప్పడే మృతిచెందారు. రోహిత్, అతని సోదరి మండపేటలోని పెద్దమ్మ పర్యవేక్షణలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రస్తుతం రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు.
కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన నాగరాజు, వెంకటలక్ష్మి కుమారుడు ఎలిపే రమేష్ ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన వడ్డి భైరవ స్వామి, భవానీ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా వడ్డి మహేష్ (14) పదోతరగతి, వడ్డి రాజేష్ (15) తొమ్మిదో తరగతి చదువుతున్నారు. కాకినాడ జగన్నాథపురం గోలీల పేట యాళ్లవారి గరువు ప్రాంతానికి చెందిన సబ్బతి రమేష్ అలియాస్ రఘుఏత్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులైన క్రాంతి కిరణ్(19), పాల్ అభిషేక్ ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు.
కాకినాడ రూరల్ తూరంగి మీసాల చిన్నయ్యపేటకు చెందిన సాయి మహేష్(18) మృత్యువాతపడగా నీట్‌కు ప్రిపేర్ అవుతున్నట్లు కుటుంబికులు తెలిపారు.. శేరులంకకు చెందిన పంపా మహేష్, కాకినాడకు చెందిన తాటిపూడి నితీష్‌లు మొత్తం ఎడుగురు మృతదేహాలు స్వగ్రామాలకు పంపించడంతో ఆప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.. అయితే సబ్బత క్రాంతి కిరణ్ మృతదేహం మాత్రం లభ్యం కాలేదని అధికారులు తెలిపారు.





















