Nama Nageshwar Rao: దోపిడీకి గురైన టీఆర్ఎస్ ఎంపీ కొడుకు, కత్తితో బెదిరించి 75 వేలు చోరీ
Nama Nageshwar Rao Son: పృథ్వీ తేజ కారులో వెళ్తుండగా, టోలిచౌకి వద్ద ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. బలవంతంగా కారులోకి వారు ఎక్కారు.
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు దోపిడీకి గురయ్యారు. హైదరాబాద్ లో ప్రధాన రహదారులపైనే ఆయన బెదిరింపులకు లోనయ్యారు. అలా దుండగులు నామా నాగేశ్వరరావు కుమారుడి నుంచి రూ.75 వేలు ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఈ ఘటన జరిగాక నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీ తేజ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే..
పృథ్వీ తేజ కారులో వెళ్తుండగా, టోలిచౌకి వద్ద ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. ఓ బైక్ ను కారుకు అడ్డంగా ఆపి బలవంతంగా కారులోకి వారు ఎక్కారు. ఆయనను కత్తితో బెదిరించి కారులోనే కూర్చొని ఆ ప్రాంతమంతా తిరిగారు. వాహనంలో నుంచి పృథ్వీని దిగకుండా అడ్డుకొన్నారు. అనంతరం కత్తితో బెదిరించి రూ.75 వేలు లాక్కున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు పృథ్వీ పోలీసులకు తెలిపారు. ఆ మేరకు శనివారం రాత్రి పంజాగుట్ట పీఎస్‌లో కేసు పెట్టారు. ఈ ఘటన జులై 31 రాత్రి జరిగినట్లు చెప్పారు. ఆ రోజు సాయంత్రం షాపింగ్ కోసం పృథ్వీ తేజ ఆ ప్రాంతానికి వెళ్లారు. రాత్రి వేళ షాపింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దోపిడీ జరిగింది.
పృథ్వీతేజ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు ఈ ప్రాంతంలోని సీసీటీవీ పుజేజీని పరిశీలిస్తున్నారు. పృథ్వీతేజ ఏ మార్గంలో ప్రయాణం చేశాడో ఆ మార్గంలోని సీసీటీవీల పుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ మార్గంలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగారా లేక పృథ్వీని ఎవరైనా వాహనంలో ఫాలో అయ్యారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు ఓ వ్యాపారి. ఆయన జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్నారు. జూలై 31న కారులోకి ఎక్కిన దుండగులు డ్రైవర్ సీట్‌లో ఉన్న పృథ్వీ తేజ మెడపై కత్తి పెట్టి కొండాపూర్ వైపు కారును పోనివ్వాలని బెదిరించారు. మధ్యలో ఆగి ఓ వైన్ షాపు నుంచి మద్యం తెచ్చుకొని తాగారు. మధ్యలో మరో వ్యక్తి కూడా కారు ఎక్కాడు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఎంపీ కుమారుడిపై పిడి గుద్దులు గుద్దుతూ దాడి చేశారు. అలా గచ్చిబౌలి, టోలీచౌకి, మెహెదీపట్నం మీదుగా ఎస్ ఆర్ నగర్ వైపు వచ్చారు. ఆ ప్రాంతంలో ఓ బైకును వీరి కారు ఢీకొట్టింది. పంజాగుట్ట నిమ్స్ వద్దకు రాగానే, అదును చూసి ఎంపీ కుమారుడు కారు నుంచి దూకేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.