Viral News: అల్లుడా మజాకా.. 100 రకాల వంటకాలు తిన్నాడు, చిన్న ట్రిక్‌తో తులం బంగారం గెలిచాడు
Dasara Festival 2025 | దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో అత్తవారింట్లో కొత్త అల్లుడి కోసం వంద రకాల వంటకాలు చేసి వడ్డించారు. సరదాగా చేసిన సంభాషణతో తులం బంగారం గెలిచాడు.

Kothakota In Wanaparthy District | దసరా పండుగ అంటే పండుగల సీజన్ మొదలైనట్లే. దేశమంతా విజయదశమి సందడి నెలకొంటుంది. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతికి కొత్త అల్లుడికి వందకు పైగా రకాల వంటకాలు రుచి చూపించడం చూస్తుంటారు. అదే విధంగా తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని కొత్తకోట పట్టణంలో ఒక కుటుంబం కొత్త అల్లుడికి వందకు పైగా రకాల వంటలు వడ్డించింది. ట్విస్ట్ ఏంటంటే.. కొత్త అల్లుడు వంద వంటలు రుచి చూశాడు. పనిలో పనిగా తులం బంగారం సైతం గెలిచాడు. ఆ ట్విస్ట్ ఏంటంటారా.. అందుకు ఈ వివరాలు చదివేయండి.
వనపర్తి జిల్లాలోని కొత్తకోట మున్సిపాలిటీకి చెందిన గుంతా సురేష్, ఆయన అతని భార్య సహానా రెండు నెలల క్రితం తమ కుమార్తె సింధు వివాహాన్ని నికిత్ అనే యువకుడితో జరిపించారు. పెళ్లి తర్వాత మొదటి పెద్ద పండుగ దసరా కావడంతో అత్తారింట్లో చాలా ఉత్సాహంగా ఉన్నారు. దసరా ముందు రోజున వారు సాంప్రదాయంగా తెలంగాణ శైలిలో 101 రకాల వంటకాలతో అల్లుడికి అద్భుతమైన విందు ఏర్పాటు చేశారు. అత్తింటి వారు తనపై చూపిస్తున్న ప్రేమకు కొత్త అల్లుడు ఫిదా అయ్యాడు.
అల్లుడి ముందు 100 రకాల వంటకాలు
బిర్యానీ నుండి పులిహోర, సకినాలు (తెలంగాణ క్రంచీ స్నాక్) నుంచి బెల్లం-నెయ్యి, రోటీ లడ్డూ వరకు చాలా రకాల వంటలు చేశారు. సురేష్ మాట్లాడుతూ.. అల్లుడికి మా ప్రేమ తక్కువగా అనిపించకూడదని, అందుకే 101 వంటకాలు చేశాం. ఇది అత్తారిల్లా లేదా ఫైవ్-స్టార్ హోటలా అని ఫీల్ వచ్చేలా చేశామన్నారు. ఆ తరువాత ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది.
భోజనం సమయంలో అల్లుడు నికిత్ సరదాగా అత్తగారితో ఎన్ని వంటకాలు చేశారని అడగగా 101 రకాలు అని చెప్పారు. అయితే ఒకటికి రెండుసార్లు నికిత్ వంటకాలు లెక్కించగా 100 వంటకాలు ఉన్నట్లు గుర్తించాడు. ఒక వంటకం మిస్సింగ్ అని గుర్తించాడు. తక్కువ ఉన్నాయని నిరూపిస్తే ఏమిస్తారని అడిగాడు. అత్తింటి వారు నవ్వుతూ.. తులం బంగారు ఇస్తామన్నారు. నికిత్ అవి వంద వంటకాలు ఉన్నాయని నిరూపించడంతో అత్తింటి వారు ఒప్పుకున్నారు. ఒక సైడ్ డిష్ మిస్ అయింది.
తెలంగాణలో దసరా పండుగకు ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి 101 రకాల వంటకాలతో భోజనం
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2025
ఒక్క వంటకం తగ్గడంతో తులం బంగారం దక్కించుకున్న అల్లుడు
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో తన కూతురు సింధుకు, నికిత్ అనే అబ్బాయికి ఇచ్చి 2 నెలల క్రితం పెళ్లి చేసిన గుంత సురేష్, సహన దంపతులు
పెళ్లి తర్వాత… pic.twitter.com/l1zlHMtWBB
అల్లుడికి తులం బంగారం
అత్తగారు సహానా నవ్వుతూ అల్లుడి కళ్లు చాలా చురుకైనవి. ఒకటి తగ్గిందని బాగానే గుర్తించాడు. వంద వంటకాలు రుచి చూడటంతో పాటు తులం బంగారం గెలుచుకున్నాడు. వచ్చేసారి 102 వంటకాల ఛాలెంజ్ పెడతాం అన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొత్త అల్లుడిని బాగా చూసుకుంటే అత్తింట్లో కూతురు అంతే హ్యాపీగా ఉంటుందని భావిస్తారు.






















