Hyderabad News : హైదరాబాద్ లో రోడ్డుపై మహిళ ప్రసవం, పండంటి మగబిడ్డకు జననం!
Hyderabad News : హైదరాబాద్ లో రోడ్డుపై ఓ మహిళ ప్రసవించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న మహిళకు ఒక్కసారిగా నొప్పులు వచ్చాయి.
![Hyderabad News : హైదరాబాద్ లో రోడ్డుపై మహిళ ప్రసవం, పండంటి మగబిడ్డకు జననం! Hyderabad Woman delivered baby boy on road side both shifted to govt hospital Hyderabad News : హైదరాబాద్ లో రోడ్డుపై మహిళ ప్రసవం, పండంటి మగబిడ్డకు జననం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/24/08370629e88e99fdc3e0c615fb8b24dd1671892740291235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyderabad Woman delivered baby boy on road side : హైదరాబాద్ లో ఓ మహిళ రోడ్డుపై ప్రసవించింది. నగరంలోని రామచంద్రాపురం అశోక్ నగర్ జంక్షన్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గర్భిణీకి ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి. మహారాష్ట్రకు చెందిన మహిళ ఇస్నాపూర్‌లో నివాసం ఉంటుంది. శనివారం మధ్యాహ్నం అశోక్ నగర్ కూడలి వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా నొప్పులు రావడంతో రోడ్డుపై రోదిస్తూ కూర్చుండిపోయింది. నొప్పులతో విలవిల్లాడుతున్న ఆమెను గమనించిన స్థానికులు... అట్టముక్కలు తెచ్చి అడ్డుగా పెట్టారు. కాసేపటికి ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం మహిళను, బిడ్డను ఆటోలో పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వారికి ఆర్థిక సాయం చేసి ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అక్కడక్కడా జరిగాయి. కొన్నిసార్లు అనుకోకుండా ప్రసవం జరిగితే, మరికొన్నిసార్లు ఆసుపత్రికి వెళ్తుంటే దారి మధ్యలోనే ప్రసవం అవుతుంది.
108లో ప్రసవం
జి.మాడుగుల బొయితిలి పంచాయతీ మండిభ గ్రామానికి చెందిన గర్భిణి కొర్ర సాల్మ 108 వాహనంలోనే ప్రసవించింది. శుక్రవారం ఉదయం సాల్మకు పురిటినొప్పులు రావడంతో 108కు కాల్ చేశారు. వాహనంలో ఆమెను జి.మాడుగుల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటినొప్పులు అధికం అయ్యాయి. పులుసు మామిడి సమీపంలో అంబులెన్స్ ను రోడ్డు పక్కన నిలిపి ఈఎంటీ ఆమెకు పురుడు పోశారు. ఆమె పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డ ఇద్దరిని జి.మాడుగుల ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు కలెక్టర్ ప్రసవం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిస్రా భార్య, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు అదనపు కలెక్టర్ ఇలా ట్రిపాఠి, ఆమె భర్త కలెక్టర్ భవేష్ మిశ్రాకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ ప్రసవించడం చాలా గొప్ప విషయం అని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ సమర్థ పాలన వల్లే ప్రజల మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వాసుపత్రిని ఎంచుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయలు బాగుండడం వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు. పురిటి నొప్పులు రావడంతో ఇలా త్రిపాఠి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించినప్పటికీ శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో సాధ్య పడలేదు. దీంతో సీ సెక్షన్ చేసి బిడ్డను బయటకు తీయాలని నిర్ణయించారు. గైనకాలజిస్టులు శ్రీదేవి, లావణ్య, సంధ్యారాణి, విద్య ఆపరేషన్ చేశారు. ఇలా త్రిపాఠి మగ శివువుకు జన్మనిచ్చారు. శిశువు 3 కిలోల 400 గ్రాముల బరువుతో పూర్తి ఆరోగ్యంగా పుట్టినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంజీవయ్య తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించి ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ ను అందరూ ప్రశంసిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)