Case On YS Sharmila : లోటస్ పాండ్ ఘటన, బంజారాహిల్స్ పీఎస్ లో వైఎస్ షర్మిలపై కేసు నమోదు!
Case On YS Sharmila : లోటస్ పాండ్ ఘటనలో వైఎస్ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిలతో పాటు ఇద్దరు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Case On YS Sharmila : హైదరాబాద్ లోటస్ పాండ్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల లోటస్ పాండ్ నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో షర్మిల, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల ఆగ్రహానికి లోనై పోలీసులపై చేయి చేసుకున్నారు. ఎలాంటి ధర్నాలకు, నిరసనలకు వెళ్లకపోయినా అరెస్టులు చేయడమేంటని షర్మిల ప్రశ్నిస్తున్నారు. సచివాలయం, సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు షర్మిల యత్నించారని అందుకే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు అంటున్నారు.
లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత
లోటస్ పాండ్ వద్ద పోలీసుల మీద దాడి చేసిన వైఎస్ షర్మిలతో పాటు కారును ఆపకుండా పోనిచ్చిన ఇద్దరు డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదుచేశారు. కానిస్టేబుల్ గిరి బాబు కాలు మీద కారు ఎక్కించిన షర్మిల కాన్వాయ్ లో ఇద్దరు డ్రైవర్ ల మీద బంజారాహిల్స్ ఎస్ ఐ రవీందర్ ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఫిర్యాదుతో ఐపీసీ 332, 353 , 509, 427 సెక్షన్స్ కింద షర్మిలపై కేసు నమోదు చేశారు. వైఎస్ షర్మిల పోలీసుల వద్ద మాన్ పాక్స్ లాక్కొని పగలగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. షర్మిలపై 337, రెడ్ విత్ 34 కింద మరో రెండు సెక్షన్లు నమోదు చేశారు. అయితే కారు ఎక్కించడంతో గాయపడ్డ కానిస్టేబుల్ గిరిబాబును స్టార్ ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా, కాలి లిగ్మెంట్‌కు గాయం అయినట్లు డాక్టర్స్ గుర్తించారు. ఈ క్రమంలో బాధిత పోలీసుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు.
ఎస్సై, కానిస్టేబుల్ పై దాడి కేసులో విచారణ
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎపిసోడ్‌పై పోలీసులు రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ సీపీ సీవీఆనంద్ మాట్లాడుతూ సచివాలయం, సిట్ ఆఫీస్‌కు వెళ్లి ఏదైనా హడావుడి చేయాలని షర్మిల ప్లాన్ చేశారని అన్నారు. అందుకే ముందస్తు సమాచారంతో ఆమెను హౌస్ అరెస్టు చేసేందుకు యత్నించామన్నారు. గతంలో ఆమె చేసిన చర్యలు కారణంగానే ఇప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం పోలీసుల బాధ్యత అని అన్నారు సీవీ ఆనంద్. అందులో భాగంగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. షర్మిల విషయంలో కూడా అదే జరిగిందని పేర్కొన్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌పై దాడి కేసులో పూర్తి విచారణ జరుగుతుందని వివరించారు. అంతకంటే ముందు మాట్లాడిన డీసీపీ జోయల్ డెవిస్... ఎస్సైను షర్మిల కొట్టారన్నారు. ఎస్సై ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే కేసు రిజిస్టర్ చేసినట్టు కూడా వెల్లడించారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడం పద్దతి కాదని చట్టం ప్రకారం చర్యలు ఉంటాయన్నారాయన.
షర్మిలను పరామర్శించిన భర్త అనిల్
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను ఆమె భర్త బ్రదర్ అనిల్ పరామర్శించారు. జరిగిన ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెను పరామర్శించేందుకు విజయలక్ష్మి వచ్చారు. షర్మిలను కలిసేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదు. తర్వాత ఆ పార్టీ లీడర్ గట్టు రామచంద్రరావు వచ్చి కలిసేందుకు ప్రయత్నించారు. ఆయన్ని కూడా అనుమతి ఇవ్వలేదు. వీళ్లిద్దర్నీ అరెస్టు చేసి ఇంటికి తీసుకెళ్లిపోయారు. కాసేపటికే బ్రదర్ అనిల్ వచ్చి షర్మిలను పరామర్శించారు.