TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్
TS High Court : తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ న్యాయవాది న్యాయమూర్తికి నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది.
TS High Court : తెలంగాణ హైకోర్టు ఓ న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణలో న్యాయవాది న్యాయమూర్తితో అభ్యంతరకరంగా ప్రవర్తించడంతో పాటు న్యాయమూర్తికి నోటీసులు ఇచ్చారు. న్యాయవాది చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చిరంచింది. ఈ కేసుపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు... సీనియర్ న్యాయవాది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యాటక శాఖకు చెందిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ మాధవిదేవి చేసిన సూచనలపై సీనియర్ న్యాయవాది బాలముకుంద్‌రావు న్యాయమూర్తితో వాగ్వాదానికి దిగి కోర్టు హాల్ నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారపై హైకోర్టు సుమోటో కోర్టు ధిక్కరణగా పరిగణనలోకి తీసుకుంది. ఈ పిటిషన్‌పై శుక్రవారం చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది.
న్యాయమూర్తికి నోటీసులపై ధర్మాసనం సీరియస్
న్యాయమూర్తికి పంపిన నోటీసులు వెనక్కి తీసుకోకుండా, తన తప్పును ఒప్పుకుని అఫిడవిట్ దాఖలు చేయకుండా సమర్థించుకోవడానికి ప్రయత్నించిన న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. లాయర్ ను వృత్తి నుంచి బహిష్కరించడంతో పాటు క్రిమినల్ కోర్టు ధిక్కరణ కింద జైలుకు పంపుతామని హెచ్చరించింది. కోర్టు ధిక్కరణ కింద ఆరు నెలలు శిక్షను పరిగణనలోకి తీసుకోకుండా, అంతకుమించి జైలుశిక్ష విధిస్తామని తెలిపింది. సుదీర్ఘ అనుభవం ఉన్న న్యాయవాదిగా భావి న్యాయ విద్యార్థులకు ఏం సందేశమిస్తారని ప్రశ్నించింది. న్యాయమూర్తికి నోటీసులు ఇచ్చి, దానికి సమాధానం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం చరిత్రలో ఎన్నడూ చూడలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అడ్వొకేట్ జనరల్ ఓ దశంలో జోక్యం చేసుకుని ఈ న్యాయవాది గతంలో పలుమార్లు కోర్టులో అనుచితంగా ప్రవర్తించిన సందర్భాలను గుర్తుచేశారు. ఈ విచారణ మధ్యలో న్యాయవాది బాలముకుంద్ రావు వివరణ ఇవ్వబోగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. తాము చెప్పేది పూర్తిగా వినకుండా చేసిన తప్పును సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించింది. చివరి అవకాశం ఇస్తున్నామని, న్యాయమూర్తి క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఇలా చేయని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చరిస్తూ విచారణను వాయిదా వేసింది.
ఇంతకీ ఏం జరిగిందంటే ?
ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పి. మాధవీదేవి కోర్టులో బాలముకుంద్ రావు జడ్జిపైన, తోటి న్యాయవాదులపైన ఆగ్రహంగా అరిచారు. అంతేకాదు తాను చేసిన ఆరోపణలపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటానని పేర్కొంటూ న్యాయమూర్తికే లిఖితపూర్వక నోటీసు ఇచ్చారు.దీంతో న్యాయవాది చర్యను తీవ్రంగా పరిగణించిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్. తుకారాంజీల ధర్మాసనం అతడిపై క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఆ న్యాయవాది ఇప్పటికీ తప్పుచేసినట్లు అంగీకరించడంలేదని తెలిపారు. తాను తప్పుచేయలేదనే ధోరణిలో వితండ వాదన చేస్తున్నారని చెప్పారు. గతంలోనూ ఇలాంటి ప్రవర్తనతో కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ స్పందిస్తూ తాను ఎనిమిది హైకోర్టుల్లో పనిచేశానని, ఇలా జడ్జికి నోటీసు ఇవ్వడం ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. దాదాపు 40 ఏళ్ల ప్టాక్టీస్ ఉందని చెబుతున్న ఆయన ఈ వయస్సులో ఇలా ప్రవర్తించడం సరికాదని తెలిపారు. అదుపు లేకుండా, ఓ రౌడీ తరహాలో ప్రవర్తించడాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని చెప్పారు. న్యాయవాదిపై ఆధారపడిన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని చివరి అవకాశం ఇస్తున్నామని వార్నింగ్ ఇచ్చారు. ఇంటికి వెళ్లి తన ప్రవర్తనపై సమీక్షించుకోవాలని.. తన తప్పును తెలుసుకోవాలని సూచించారు. ఏడురోజుల్లో భేషరతుగా క్షమాపణలు తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయడంతోపాటు న్యాయమూర్తికి ఇచ్చిన నోటీసు ఉపసంహరించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.