CM KCR On Etela Rajender : ఈటల పేరు పదే పదే ప్రస్తావించిన కేసీఆర్, రాజకీయ వ్యూహంలో భాగమేనా?
CM KCR On Etela Rajender : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు చాలా ఆసక్తిగా జరిగాయి. సీఎం కేసీఆర్ పదే పదే ఈటల రాజేందర్ పేరు ప్రస్తావించారు.
CM KCR On Etela Rajender : వాళ్లిద్దరూ స్నేహితులు, తెలంగాణ పోరాటంలో ప్రత్యేక రాష్ట్రం కలిసి కొట్లాడారు. టీఆర్ఎస్ ఆవిర్భావం వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్. వారిలో ఒకరు కేసీఆర్ అయితే మరొకరు ఈటల రాజేందర్. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా సాధ్యం అనేదానికి వీరిద్దరే నిదర్శనం. రాజకీయం మారింది స్నేహితులు కాస్త ఆ మధ్య బద్దశత్రువులయ్యారు. టీఆర్ఎస్ జెండానే మాది అన్న ఈటలను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో బీజేపీలో చేరిన ఈటల... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. అయితే ఈ ఎన్నికల్లో ఈటలను ఓడించాలని టీఆర్ఎస్ విశ్వప్రయత్నమే చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఈటల బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ మెట్లు ఎక్కారు. గత సమావేశాల్లో నిరసన చేసిన ఈటలను సభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే అప్పట్లో ఓ టాక్ కూడా వినిపించింది. కేసీఆర్ సభలోకి అడుగుపెట్టేటప్పుడు ఈటల సభలో ఉండకూదని భావించారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇవన్నీ జస్ట్ ఆరోపణలే అని తాజా బడ్జెట్ సమావేశాలు తేల్చేశాయి. ఈ సమావేశాలు చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చజరిగింది. ఈ చర్చ సందర్భంగా ఈటల రాజేందర్ పదే పదే కేసీఆర్ ను ప్రస్తావించడం, వివాదం తర్వాత తొలిసారి కేసీఆర్ నోటి వెంట తొలిసారి ఈటల పేరు వినిపించడం ఈ సమావేశాల్లో హైలెట్ గా నిలిచాయి. వీటిని చూసినవాళ్లంతా మళ్లీ కేసీఆర్-ఈటల స్నేహం చిగురించిందని అంటున్నారు.
ఈటల పేరు పదే పదే ప్రస్తావించిన కేసీఆర్
కాంగ్రెస్ పాలనలో బ్రోకర్లు, పైరవీలు చేసినవాళ్లు గెలిచారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. మళ్లీ కాంగ్రెస్ వస్తే పైరవీకారుల రాజ్యం వస్తుందన్నారు. సన్నబియ్యం సలహా ఆనాడు ఈటల రాజేందర్ ఇచ్చారన్నారు. మాట్లాడితే జై శ్రీరామ్ అంటారు.. కానీ గుండెల్లో మాత్రం ఉండదు వాళ్లకు అని బీజేపీని విమర్శించారు. కమ్యూనిటీ హాల్స్ పర్ ఆల్ కమ్యూనిటీస్ ...దీనికి పేరు కూడా మా ఈటెల రాజేందరే పెట్టారన్నారు. ఉద్యోగులకు మళ్లీ జీతాలు పెంచుతామన్నారు. మోదీ సంకుచితమైన రాజకీయాలు వదులుకోవాలని కేసీఆర్ సూచించారు. 'మేము మీకు సహకరిస్తాం- మీరు మాకు సహకరించండి' అనే ధోరణి పాటించాలన్నారు. డైట్ ఛార్జీలు పెంచాలని ఈటల రాజేందర్ కోరిక మేరకు పెంచుతున్నామన్నారు. ఈటల రాజేందర్ చెప్పారు కాబట్టి చేయం అని అనొద్దని, కావాలంటే ఈటల రాజేందర్ కు ఫోన్ చేసి సలహాలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ పై ఈటల రాజేందర్ సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకున్నామన్నారు. ఆర్టీసీ బస్సులు, రైతు రుణమాఫీ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్ తెలిపారు. గెస్ట్ లెచ్చలర్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నా్రు.
ఈటల రాజేందర్ కు అన్నీ తెలుసు
"మాపై ఎన్ని కేసులు, ఎన్ని కుట్రలు చేశారో అందరికీ తెలుసు. కాళేశ్వరం, పాలమూరు అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేశారు. ఈటల రాజేందర్ కు అన్నీ తెలుసు. ఈటల రాజేందర్ ఇవ్వాళ ఇక్కడి నుంచి అక్కడి వెళ్లొచ్చు కానీ అన్నీ తెలుసు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి వస్తే మార్పు ఏంటో చూపిస్తాం. రిటైర్డ్ అయ్యే టైంలో దిక్కులేని పెంట పెట్టుకున్నాను. నీళ్లు కావాలంటే విశ్వగురువులు అవసరం లేదు- దేశ గురువులు సరిపోతారు. భారత దేశానికి కొత్త ఇరిగేషన్ పాలసీ రావాలి- అది బీఆర్ఎస్ మాత్రమే చేయగలదు. దమ్మున్న సీఎం తెలంగాణలో ఉన్నాడు కాబట్టే 24 కరెంట్ వచ్చింది. దమ్మున్న ప్రధాని వస్తే దేశానికి కూడా 24 గంటల కరెంట్ వస్తది. తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కరెంట్ పోదు పోనివ్వను.
అసెంబ్లీలో కేసీఆర్ నోట ఈటల రాజేందర్ పేరు
అసెంబ్లీలో ఈటల రాజేందర్ మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. సమస్యలు రెండుసార్లు చెప్పకుండా కంటిన్యూగా చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఈటల రాజేందర్ లేవనెత్తిన సమస్యలను నోట్ చేసుకోవాలని మంత్రి హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ సూచించారు. సమస్యలు ఉన్నాయి కాబట్టే ఈటల రాజేందర్ మాట్లాడారని, వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు కేసీఆర్.
ఈటల రియాక్షన్
తన పేరును కేసీఆర్ పదే పదే ప్రస్తావించడంపై పట్ల ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రియాక్టయ్యారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడారని ఆరోపించారు. సభలో మొత్తం 18 సార్లు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును సీఎం కేసీఆర్ ప్రస్తావించారు.
కేసీఆర్ ఈటల పేరు ప్రస్తావనపై చర్చ
అసెంబ్లీలో పదే పదే ఈటల పేరు ప్రస్తావించడం వెనుక కేసీఆర్ రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈటలను ఎటూ కాకుండా చేసి రాజకీయంగా ఇబ్బంది పెట్టటాలని చూడడం, బీఆర్ఎస్ లోకి రప్పించడం, ఆది నుంచి బీజేపీలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల కన్నా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఈటల బెటర్ అని తెలిసేలా ఫోకస్ చేయడం, బీజేపీ ఈటలను నమ్మకుండా మరింత దూరం పెట్టేలా చేయడం, ప్రతిపక్ష పార్టీల్లో కూడా కేసీఆర్ కోవర్ట్ లు ఉన్నారని ఈ మధ్య ఈటల చేసిన కామెంట్లకు రివర్స్ పంచ్ వేయడం కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల ఆర్థికమంత్రి హరీశ్ రావు కూడా ఈటల ఎక్కడున్నా.. మావాడే అని అసెంబ్లీలో కామెంట్ చేయడాన్ని కూడా బీఆర్ఎస్ ఈటలను పక్కా వ్యూహంతోనే టార్గెట్ చేసినట్లు భావించవచ్చు. గతంలో జానారెడ్డిని కూడా ఇదే రీతిలో ఆన్ పాపులర్ చేశారని, ఇప్పుడు ఈటల అదే వ్యూహంలో టార్గెట్ చేశారన్న అనుమానాలు లేకపోలేదు.