TS Traffic Challans : ట్రాఫిక్ పోలీసుల డిస్కౌంట్ ఆఫర్ కు భారీ స్పందన, ఇప్పటి వరకూ ఎంత వసూలైందంటే?
Traffic Challans : తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల డిస్కౌంట్ ఆఫర్ కు భారీ స్పందన వస్తుంది. గత 15 రోజుల్లో 1.3 కోట్ల చలాన్లు క్లియర్ అవ్వగా, రూ.130 కోట్లు వసూలు అయ్యాయని పోలీసులు తెలిపారు.
Traffic Challans : తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) ఇచ్చిన బంఫర్ ఆఫర్ కు భారీ స్పందన వస్తోంది. ట్రాఫిక్ చలాన్లు(Challans) క్లియర్ చేసుకునేందుకు వాహనదారులు పోటీపడుతున్నారు. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు 1.3 కోట్ల పెండింగ్ చలాన్లు(Pending Challans) క్లియర్ అయినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల చలాన్లపై భారీ డిస్కౌంట్ ఇవ్వడంతో వాహనదారులు తమ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకుంటున్నారు. 15 రోజుల వ్యవధిలో చలాన్ల రూపంలో రూ.130 కోట్లు ఫైన్ లు వాహనదారులు చెల్లించారు. సాధారణ ఛార్జ్ లతో చూస్తే ట్రాఫిక్ పోలీసులు రూ.600 కోట్ల ఫైన్ లు విధించారు. చలాన్ కట్టిన వారిలో 80 శాతానికి పైగా హైదరాబాద్(Hyderabad), సైబరాబాద్(Cyberabad), రాచకొండ(Rachakonda) పరిధిలోని వాహనదారులు ఉన్నారు.
నిమిషానికి 1000 చలాన్లు క్లియర్
రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31వరకు చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ఉంది. మొదటి రోజు నిమిషానికి 1000 చలాన్లు క్లియర్ అయ్యాయాని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మొదటి రోజే రూ.5.5 కోట్ల ఫైన్(Fines) లు వసూలు అయ్యాయి. డిసెంబర్ 2021 వరకు 80 లక్షల పెండింగ్ చలాన్ లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పెండింగ్ చలాన్ క్లియరెన్స్ కోసం పోలీసుల ఈ ఆఫర్ ఇచ్చారు. వన్ టైమ్ డిస్కౌంట్ పేరుతో పెట్టిన రెట్ లకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది.
రూ.130 కోట్లు వసూలు
జాయింట్ కమిషనర్(ట్రాఫిక్) ఏవీ రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకూ పెండింగ్ చలాన్ల ద్వారా రూ.130 కోట్లు వసూలు అయినట్లు తెలిపారు. దీని అసలు విలువ రూ.500 కోట్లు పైగా ఉంటుందని పేర్కొన్నారు. ఇకపై కూడా చలాన్ల చెల్లింపు వేగవంతం చేస్తామన్నారు. ఎక్కువ చలాన్లు పెండింగ్ లో ఉన్న వాహన నంబర్లను స్కాన్ చేసి, వాహనదారులను చలాన్లు చెల్లించేలా అవగాహన కల్పిస్తామన్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఎక్కువగా చలాన్లు క్లియర్ అయ్యాయని ఏవీ రంగనాథ్ తెలిపారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో వాహనదారులు కూడా ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
80 లక్షల చలాన్లు
మార్చి 1వ తేదీన సుమారు 5 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయని జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ చలాన్లు అసలు మొత్తం రూ.20 కోట్లు కాగా డిస్కౌంట్ తర్వాత రూ.5.5 కోట్లు వసూలు అయ్యాయన్నారు. ఎక్కువ మంది చలాన్లు కట్టేందుకు ప్రయత్నిస్తున్న కారణంగా వెబ్ సైట్ క్రాష్ కాకుండా బ్యాండ్ విత్ 10 రెట్లు పెంచామని తెలిపారు. డిసెంబర్ 2021 వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 80 చలాన్లు విధించారు. వీటిల్లో 60 లక్షల చలాన్లు హెల్మెట్ ధరించకపోవడం, ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయి.