Rahul Gandhi OU Meeting : ఓయూలో రాహుల్ మీటింగ్, వీసీతో భేటీ అయిన జగ్గారెడ్డి, అనుమతి ఇస్తారా?
Rahul Gandhi OU Meeting : హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ వీసీతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమావేశం అయ్యారు. రాహుల్ గాంధీ విద్యార్థులతో ముఖాముఖి చర్చకు అనుమతి ఇవ్వాలని కోరారు.
Rahul Gandhi OU Meeting : హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో రాహుల్ గాంధీ మీటింగ్ కోసం యూనివర్సిటీ వీసీని కలిశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి. ఓయూలో రాహుల్ గాంధీ మీటింగ్ కోసం వీసీకి రిప్రెసెంటేషన్ ఇచ్చారు. జగ్గారెడ్డితో పాటు జాతీయ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఓయూ విద్యార్థి నేతలు కొటూరి మానవతా రాయ్, కేతురీ వెంకటేష్, మరికొందరు ఓయూ విద్యార్థి నాయకులు వీసీని కలిశారు.
పార్టీ జెండాలు లేకుండా సమావేశం
అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ... రాహుల్ గాంధీ వచ్చే నెల 7వ తేదీ ఓయూలో విద్యా్ర్థులతో సమావేశం కానున్నారని, అందుకు అనుమతి కోసం వీసీని కలిశామన్నారు. తెలంగాణ ఇచ్చిన రాహుల్ ఓయూకి రావాలని కోరామని అందుకు ఆయన ఒప్పుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ సమస్య తెలుసుకోవడం కోసం రాహుల్ వస్తున్నారన్నారు. అయితే ఈ సమావేశానికి అనుమతి వస్తుందని భావిస్తున్నామన్నారు. యూనివర్సిటీలో రాజకీయాలు చేసేందుకు రావడంలేదన్నారు. పార్టీ జెండాలు, కండువాలు లేకుండా ఓయూకు వస్తామన్నారు. కేవలం విద్యార్థులు, నిరుద్యోగులతో ముఖాముఖి ఉంటుందన్నారు. చరిత్ర గల ఆర్ట్స్ కాలేజి గ్రౌండ్ లో సమావేశం ఏర్పాటుచేయాలని కోరామన్నారు. లేదంటే సెకండ్ ఆప్షన్ కింద ఠాగూర్ ఆడిటోరియం ఇవ్వాలని వీసీని కోరామన్నారు.
రాజకీయ మీటింగ్ కాదు
"ఓయూకి చాలా చరిత్ర ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఓయూ, కాకతీయ వర్శిటీలు ప్రధాన పాత్ర పోషించాయి. అందుకోసం ఓయూకు రావాలని విద్యార్థి నాయకులు అడుగుతున్నారు. విద్యార్థులతో సమావేశంలో రాజకీయ చర్చ ఉండదు. విద్యార్థులకు ఉన్న సమస్యలు, ఉద్యోగాలు, ఇతర విషయాలను అడిగితెలుసుకోనున్నారు. ఈ సమావేశంలో అన్ని విద్యార్థి సంఘాలు పాల్గొవచ్చు. ఇతర విద్యార్థి సంఘాలు వేరే విధంగా భావించవద్దు. తెలంగాణను ఇచ్చిన రాహుల్ గాంధీకి సముచిత గౌరవం ఇవ్వండి. వీసీని ఆర్ట్ కాలేజి గ్రౌండ్ ఇవ్వండని కోరాం. టీఆర్ఎస్ విద్యార్థి సంఘాలు ఈ మీటింగ్ పై ఏదైనా అబ్జెక్షన్ లేవనెత్తితే వీసీ ఎలా స్పందించారో చూడాలి." అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు మొదలుపెట్టారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఓయూ లో రాహుల్ గాంధీ సమావేశం నిర్వహిస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. అన్ని సంఘాల విద్యార్థి నాయకులు ఈ సమావేశానికి సహకరించాలని కాంగ్రెస్ నేతలు కోరారు.