(Source: ECI/ABP News/ABP Majha)
Gaddiannaram Fruit Market: గడ్డి అన్నారం మార్కెట్ వద్ద ఉద్రిక్తత, కూల్చివేతలు ఆపాలని హైకోర్టు ఆదేశం
Gaddiannaram Fruit Market: గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీశాయి. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.
Gaddiannaram Fruit Market: హైదరాబాద్ గడ్డి అన్నారం మార్కెట్ కూల్చివేతలు తక్షణమే ఆపాలని తెలంగాణ హైకోర్టు(High Court) ఆదేశించింది. వ్యాపారులను వారి వస్తువులు తీసుకునేందుకు అనుమతించాలని తెలిపింది. నెల రోజుల పాటు మార్కెట్ తెలిచి ఉంచాలన్న కోర్టు ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారని వ్యాపారులు ఆరోపించారు. కూల్చివేతల కారణంగా గడ్డి అన్నారం మార్కెట్ వద్ద ఉద్రిక్త నెలకొంది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసుల సాయంతో మార్కెట్ కూలుస్తున్నారని వ్యాపారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గడ్డి అన్నారం మార్కెట్‌లో కూల్చివేతల తీరు దురదృష్టకరమని హైకోర్టు అభిప్రాయపడింది. మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ లక్ష్మీబాయి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది.
గడ్డి అన్నారం మార్కెట్ కూల్చివేత
కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గడ్డి అన్నారం మార్కెట్‌లోని భవనాలను జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు మార్కెట్ కూల్చివేత మొదలుపెట్టారు. ఈ కూల్చివేతలను వ్యాపారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వ్యాపారులు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు. ప్రభుత్వం గడ్డి అన్నారం వ్యవసాయ, పండ్ల మర్కెట్‌ను తాత్కాలికంగా బాటసింగారం(Batasingaram) లాజిస్టిక్ పార్కుకు తరలించిన విషయం తెలిసిందే. ఫ్రూట్ మార్కెట్ ఉన్న స్థలంలో ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని నిర్ణయించింది. అయితే ఫ్రూట్ మార్కెట్ తరలింపుపై వ్యాపారులు అభ్యంతరం తెలిపారు. ఫ్రూట్ మార్కెట్(Fruit Market) తరలింపుపై వ్యాపారులు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. మార్కెట్‌లో ఉన్న ఫర్నీచర్, ఏసీ సామగ్రి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్ లో వసతులు లేవని, ప్రభుత్వం హడావుడి చేస్తుందని కోర్టుకు తెలిపారు.
మార్కెట్ తెరవాలని హైకోర్టు ఆదేశాలు
బాటసింగారం మార్కెట్ లో తగిన సదుపాయాలు కల్పించామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కొహెడలో కొత్త మార్కెట్ నిర్మాణం పూర్తయ్యే వరకు బాట సింగారంలో తాత్కాలికంగా మార్కెట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. బాటసింగారం తాత్కాలిక మార్కెట్ కు వెళ్లేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారని కోర్టు వెల్లడించింది. గత కొంతకాలంగా వ్యాపారులు, ప్రభుత్వం మధ్య మార్కె్ట్ విషయంలో వివాదం కొనసాగుతుంది. ఇటీవల హైకోర్టు గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌ను వెంటనే తెరవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ ఆదేశాలు అమలు చేసి తదుపరి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్కెట్ లో ఉన్న వ్యాపారుల సామాగ్రి తీసుకోవడానికి మాత్రమే ఓపెన్ చేయాలని కోర్టు తెలిపింది.