Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Revanth Reddy : మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాల సర్పంచ్ లు, ఎంపీటీసీలను మభ్యపెట్టి కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.
Revanth Reddy : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, సంక్షేమం, అభివృద్ధిని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి మునుగోడు ప్రజల్ని ఓట్లు అడిగితే సీఎం కేసీఆర్ ను ప్రజలు హర్షించేవారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఎప్పటిలాగానే సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల సర్పంచ్, ఎంపీటీసీలను కొనుగోలు చేయడం ద్వారా గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మారుస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తు్న్నారని విమర్శించారు. నల్గొండ పోరాటాల గడ్డ అని, ఎందరో పోరాటయోధులు ఈ గడ్డపై పుట్టారని రేవంత్ రెడ్డి గుర్తుచేసారు. ప్రజా సమస్యలపై ధర్మ భిక్షం, మల్లు స్వరాజ్యం, పాల్వాయి గోవర్థన్ పోరాడారన్నారు. కానీ సీఎం కేసీఆర్ కొత్త సంప్రదాయానికి తెరలేపుతున్నారని మండిపడ్డారు.
ప్రలోభాలకు లొంగిపోవద్దు
"మునుగోడు ప్రజలకు ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా... కరోనా రావడం వల్ల నా పర్యటనలో ఆలస్యం అయింది. రాజీవ్ గాంధీ 77వ జయంతి సందర్భంగా ఈ నెల 20వ తారీఖు నుంచి నిరంతరం ప్రజల్లో ఉంటాను. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తు్న్నాను. ఎనిమిది సంవత్సరాలు కొట్లాడిండ్రు, నష్టపోయారు. అధికారంలోకి వచ్చే సమయంలో ఇప్పుడు అధికార పార్టీ బెదిరింపులకో , చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతాం. కాబట్టి కలిసికట్టుగా నిలబడి మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. ఈ విజయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది. బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం"- రేవంత్ రెడ్డి
కేసీఆర్ మళ్లీ అదే నీచత్వం… మునుగోడు సహించదు!#ManaMunugodeManaCongress pic.twitter.com/7PoSZ3jCcY
— Revanth Reddy (@revanth_anumula) August 15, 2022
ఈ నెల 20 నుంచి
ప్రజల తరఫున ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఉండి కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని శ్రేణులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 20 నుంచి తాను మునుగోడులో పర్యటిస్తున్నానన్నారు. శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కలిసికట్టుగా కొట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని రేవంత్ రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు.
మండలాల వారీగా నాయకుల జాబితా
మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో కార్యాచరణ ప్రారంభించింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది. మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో వ్యూహ, ప్రచార కమిటీని ఏర్పాటుచేశారు. ఉపఎన్నిక ఇన్‌ఛార్జ్ గా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వ్యవహరిస్తారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వెల్లడించారు. మండలాల వారీగా నాయకుల జాబితాను ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ తెలిపారు. చౌటుప్పల్ మండల బాధ్యతలను మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, వరంగల్ జిల్లా నాయకుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నారాయణపురం మండల బాధ్యతలు మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్, గండ్ర సత్యనారాయణలకు అప్పగించినట్లు తెలిపారు. మునుగోడు మండల ఇన్‌ఛార్జ్ లుగా ఎమ్మెల్యే సీతక్క, విజయ రమణారావులను నియమించారు. నాంపల్లి మండలానికి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవిని నియమించారు. గట్టుప్పల్ మండలానికి మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎ సంపత్ కుమార్, ఆది శ్రీనివాస్ లకు అప్పగించారు. చండూరు మండలానికి మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్, డాక్టర్ వంశీకృష్ణ, మర్రిగూడ మండల బాధ్యతను చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిలకు కేటాయించారు.
Also Read : బీజేపీ తీరు వల్లే జనగామలో ఉద్రిక్తత- సామాన్యులపై బండి సంజయ్ గ్యాంగ్ ప్రతాపం: ఎర్రబెల్లి
Also Read : Jagadish Reddy: కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఇవే చివరి ఎలక్షన్స్, ఈడీ బోడీలు ఏం చేయలేవు - మంత్రి జగదీశ్ వ్యాఖ్యలు