Hyderabad News : మరోసారి తెరపైకి పుల్లారెడ్డి కుటుంబ వరకట్న వేధింపులు, రాష్ట్రపతికి లేఖ రాసిన ఏక్ నాథ్ రెడ్డి భార్య
Hyderabad News : పుల్లారెడ్డి కుటుంబ వరకట్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తనకు న్యాయం చేయాలని పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కోడలు రాష్ట్రపతికి లేఖ రాశారు.
Hyderabad News : పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కోడలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి వరకట్న వేధింపులపై రాష్ట్రపతికి లేఖ రాశారు. రాష్ట్రపతి ఈ నెల 29న నారాయణమ్మ కాలేజీని సందర్శించునున్నారు. ఈ తరుణంలో ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతికి లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ కాలేజీని నిర్వహిస్తున్న జి.రాఘవరెడ్డి ఆయన భార్య భారతి రెడ్డి , వారి కుమార్తె శ్రీవిద్య రెడ్డిలు గత రెండేళ్లుగా తనని, తన కూతురుని వేధిస్తున్నారంటూ రాష్ట్రపతికి లేఖ రాశారు ప్రజ్ఞారెడ్డి. తన బిడ్డను, తనను చంపేందుకు ప్రయత్నించారని ఆమె లేఖలో పేర్కొన్నారు. వరకట్నం కోసం తనని హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన 8 ఏళ్ల కూతురుని ఇంటి నుంచి బయటకి రాకుండా రాత్రికి రాత్రే గది బయట గోడ కట్టారని ఆరోపించారు. ఇవన్నీ తాను చేస్తున్న ఆరోపణలు కాదని, మీడియాలో అందరూ చూశారని తెలిపారు. కోర్టు కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. గది బయట గోడ కూల్చి వేయమని ఆదేశించిందని గుర్తుచేశారు. దీంతో అధికారులు వచ్చి ఆ గోడ తొలగించారని లేఖలో తెలిపారు.
న్యాయపర హక్కులు కాలరాస్తున్నారు
తనకు, తన కూతురికి ఉన్న న్యాయమైన హక్కులను కాలరాస్తూ బెదిరిస్తున్నారని ప్రజ్ఞారెడ్డి ఆరోపించారు. అత్త భారతి రెడ్డిపై ఇప్పటికే హైదరాబాద్ లో అనేక భూ కబ్జా కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఒక మహిళగా నా పరిస్థితిని అర్థం చేసుకుని న్యాయం చేయాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో ఆమె ప్రాధేయపడ్డారు. వి.హెచ్.పి.నేత పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి ఇలా రాష్ట్రపతికి లేఖ రాయడం సంచలనం అయింది. ఇప్పటికే తమ బలగంతో తమను, దర్యాప్తు సంస్థలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. నారాయణమ్మ కాలేజీ విజిట్ తర్వాత మరింతగా హెరాస్ చేస్తారేమోనని, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తారని ఆందోళన చెందుతున్నానన్నారు. దయచేసి తనకు, తన కూతురికి న్యాయం చేయాలని ప్రజ్ఞారెడ్డి లేఖలో కోరారు. మరి దీనిపై రాష్ట్రపతి ముర్ము ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
గృహ హింస చట్టం కింద కేసు
పుల్లారెడ్డి స్వీట్స్ వ్యవస్థాపకుడు జి.పుల్లారెడ్డి కుమారుడు జి.రాఘవరెడ్డి ప్రస్తుతం వ్యాపారా లావాదేవీలు చూసుకుంటున్నారు. ఆయన కుమారుడు ఏక్ నాథ్ రెడ్డికి 2014లో ప్రజ్ఞారెడ్డితో వివాహం అయింది. ప్రజ్ఞారెడ్డి తండ్రి కేఆర్ఎం రెడ్డి మైనింగ్ వ్యాపారం చేస్తుంటారు. వివాహం తర్వాత కొంతకాలానికి ఏక్ నాథ్ రెడ్డి, ప్రజ్ఞారెడ్డిల మధ్య గొడవలు తలెత్తాయి. భర్త, అత్తమామలు వేధింపులకు గురిచేస్తున్నారంటూ ప్రజ్ఞారెడ్డి గతంలోనే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అప్పట్లో పుల్లారెడ్డి కుటుంబ సభ్యులపై పంజాగుట్ట పీఎస్‌లో గృహహింస చట్టం కింద కేసు నమోదు అయింది.
అడ్డంగా గోడ
పుల్లారెడ్డి స్వీట్స్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. అయితే ఆయన మనవడు ఏక్ నాథ్ రెడ్డి మాత్రం వివాదాస్పదం అవుతున్నారు. ఆయన వైవాహిక జీవితం సరిగ్గా సాగడం లేదు. ఈ క్రమంలో ఆయన తన భార్య ను ఇంట్లో నే ఉంచి ఆమెను బయటకు రాకుండా ఉండేందుకు తాను ఇంట్లో ఉన్న రూమ్ లో ఒక అడ్డు గోడను రాత్రి కి రాత్రే నిర్మాణం చేసి అతను ఇంటికి తాళం వేసి పారిపోయిన ఘటన సంచలనం అయింది. అతి కష్టం మీద ఏక్ నాథ్ రెడ్డి భార్య బయటకు వచ్చి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏక్‌నాథ్ భార్య ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల చట్టం తో పాటు గృహ హింస కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.