PM Modi In Hyderabad : ప్రధాని మోదీ హైదరాబాద్‌లో దిగిన వెంటనే ఏం చేశారంటే?
PM Modi In Hyderabad : ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ తమిళ సై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు.
PM Modi In Hyderabad : హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ నగరానికి చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయంలో లాండ్ అయిన ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళ సై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ప్రధాని మోదీ హెచ్ఐసీసీకి చేరుకున్నారు.
ప్రధాని మోదీ ట్వీట్
హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. గవర్నర్ తమిళసైతో పాటు ఇతర బీజేపీ నాయకులు బేగంపేట్ ఎయిర్ పోర్టులో ఆహ్వానానికి సంబంధించిన ఫొటోలను ప్రధాని షేర్ చేశారు. ఆయన ట్వీట్ లో 'డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం.' అని తెలుగులో ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.
డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న @BJP4India నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం. pic.twitter.com/wOrG9GvabO
— Narendra Modi (@narendramodi) July 2, 2022
నగరం కాషాయవర్ణం
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ హెచ్ఐసీసీలో రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. అలాగే రేపు సాయంత్రం సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. దీంతో భాగ్యనగరంలో మొత్తం కాషాయవర్ణంగా మారిపోయింది. ఎక్కడ చూసినా బీజేపీ కటౌట్లు, జెండాలే కనిపిస్తు్న్నాయి. అలాగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణపై దృష్టిపెట్టి బీజేపీ ఈ సమావేశాల్లో తమ వ్యూహాన్ని ఖరారు చేయనుంది. బూత్ కు 200 మంది కార్యకర్తల చొప్పున వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి ప్రచారపర్వం నిర్వహించాలని నిర్దేశించినట్లు సమాచారం. బీజేపీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ నాయకులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ చేరుకున్నారు. బీజేపీకి పోటీగా టీఆర్‌ఎస్ సమావేశాలు నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుటుంబ పాలనను కూకటివేళ్లతో కూల్చే సమయం వచ్చిందన్నారు.