Minister Talasani Srinivas : ఇవాళ జ్వరం, రేపు దాడులు మునుగోడులో డ్రామాలు స్టార్ట్ - మంత్రి తలసాని
Minister Talasani Srinivas : మునుగోడులో ప్రతిపక్ష పార్టీలు డ్రామాలు మొదలుపెట్టాయని మంత్రి తలసాని విమర్శించారు. చేతికి పట్టీలు, జ్వరాలు, దాడులు ఇందులో భాగమని ఎద్దేవా చేశారు.
Minister Talasani Srinivas : మునుగోడులో ప్రతిపక్షాల డ్రామాలు స్టార్ట్ అయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సానుభూతి కోసం చేతికి పట్టీలు వేసుకుంటున్నారన్నారు. దుబ్బాక, హుజురాబాద్ లలో ఇలాగే జరిగిందన్నారు. ఇవాళ జ్వరం, రేపు దాడులు అంటూ ఏడుపులు డ్రామాలు చేస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఫ్లోరెడ్ సమస్యను పూర్తిగా పరిష్కరించామన్నారు. మునుగోడు ప్రజలు సానుభూతి డ్రామాలను నమ్మొద్దన్నారు. డ్రామాలను నమ్మితే నష్టపోయేది మునుగోడు ప్రజలే అన్నారు. జనరల్ ఎన్నికల లోపు అభివృద్ధిలో మార్పు కనిపించకపోతే ప్రజలు అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరిస్తామన్నారు. వాళ్లంతట వాళ్లే దాడులు చేయించుకొని ఏడుస్తారని ఆరోపించారు.
తెలంగాణ భవన్ లో MP లింగయ్య యాదవ్, MLC లు ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, MLA లు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, చైర్మన్ బాలరాజ్ యాదవ్, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి, TRS రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్ లతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. pic.twitter.com/yOyvMOb8md
— Talasani Srinivas Yadav (@YadavTalasani) October 25, 2022
ఇక మూడు రోజులే
"ఒకవైపు రాజగోపాల్ రెడ్డికి జ్వరం, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి ఏడుపు. మునుగోడులో టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యే మునుగోడులో ఉన్నా ప్రభుత్వ పథకాలు అన్ని అందినాయి. మునుగోడులో ఉన్నది కూడా తెలంగాణ సమాజమే. బీజేపీకి మిగిలింది ఇక మూడు రోజులే..కాబట్టి సెంటిమెంట్ రగిలించడానికి అనేక డ్రామాలు ప్రయత్నాలు. రాజకీయ పార్టీగా ప్రతి ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకుంటాం. మేం కాంట్రాక్టర్ల కోసం రాజకీయం చేసే వాళ్లం కాదు. కుట్రలు, కుతంత్రాలు మాకు అవసరం లేదు." -మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఊకదంపుడు ఉపన్యాసాలు
బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సానుభూతి డ్రామాలను మొదలుపెట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఆ డ్రామాలు నమ్మవద్దని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దుబ్బాక ఉపఎన్నిక సమయంలోనూ బీజేపీ నేతలు కావాలనే దాడి చేయించుకున్నారని, ఇప్పుడు మునుగోడులోనూ అలాగే జరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ను తిడుతున్నారు కానీ, మునుగోడుకు బీజేపీ ఏంచేసిందో చెప్పడంలేదని ఆరోపించారు. దుబ్బాక, హుజూరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి కోటి రూపాయలైనా తీసుకొచ్చారా అని మంత్రి నిలదీశారు. మిషన్ భగీరథతో కేసీఆర్ మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్య లేకుండా చేశారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష అన్నారు. తమ ప్రభుత్వం ఏంచేసిందో ప్రజలకు తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను సరిగ్గా ఇవ్వలేదని ఆరోపించారు. అన్నింటిలో తెలంగాణ ప్రభుత్వానికి అన్యాయమే జరిగిందన్నారు. కనీసం నిధులు ఇవ్వకుండా అది చేశాం ఇది చేశామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు.