(Source: ECI/ABP News/ABP Majha)
Minister Mallareddy On IT Raids : బీజేపీలో చేరితే ఐటీ దాడులుండవ్, రాజకీయ కుట్రతోనే సోదాలు- మంత్రి మల్లారెడ్డి
Minister Mallareddy On IT Raids : బీజేపీ రాజకీయ కుట్రతోనే తనపై ఐటీ దాడులు చేయించిందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.
Minister Mallareddy On IT Raids : రెండు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఐటీ దాడులు ముగిసిన అనంతరం బోయిన్ పల్లిలోని తన నివాసంలో మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.రెండు రోజుల నుంచి 65 బృందాలతో తనపై, తన కుటుంబ సభ్యులపై ఐటీ సోదాలు చేశారన్నారు. బీజేపీ కుట్ర పన్నుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు ముందే ధైర్యం చెప్పారన్నారు. తాను చిన్నప్పటి నుంచి పాలు, పూలు అమ్మి వ్యవసాయం చేసుకుంటూ బతికానని, విద్యా సంస్థలు పెట్టి పేద వాళ్లకు చదువుకునే అవకాశం కల్పించానన్నారు. తన కాలేజీలో MBA ఫీజ్ రూ.35 వేలు మాత్రమే అన్నారు. చదువుకున్న విద్యార్థులకు జాబ్ లు కూడా ఇప్పిస్తున్నానన్నారు.
ఐటీ దాడులు కొత్తేంకాదు
"మారుమూల గ్రామాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు చదువు అందిస్తున్నాను. ఇంజినీరింగ్ కాలేజీ వ్యవస్థను తీసుకొచ్చింది నేనే. నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఎలాంటి అక్రమాలు చెయ్యడం లేదు. అంతా లీగల్ గా నడిపిస్తున్నాం. మా కుటుంబ సభ్యులను రెండు రోజుల పాటు ఐటీ అధికారులు ఇబ్బందులు పెట్టారు. ప్రతీ కాలేజ్ ప్రిన్సిపాల్ ల దగ్గరి నుంచి క్లర్క్ వరకు సోదాలు చేసి విచారించారు. ఐటీ సోదాలు నాపై ఇదేం కొత్త కాదు. 1994, 2008లో ఇప్పుడు 2022 జరిగాయి. మెడికల్ కాలేజీలో సీట్లు కొనుగోలు అంతా ప్రొపర్ గా జరుగుతుంది. 150 సీట్లు ఉంటే అందులో 65 సీట్లు కౌన్సెలింగ్ ద్వారా ఇస్తున్నాం. ఉచితంగా రోజు 1000 మందికి భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ అందిస్తున్నాం. అంత ఆన్ లైన్ లో జరుగుతుంది. ఇప్పటి వరకు 28 లక్షలు మాత్రమే ఐటీ అధికారులకు దొరికాయి." - మంత్రి మల్లారెడ్డి
కుట్రతోనే ఐటీ దాడులు
బీజేపీ రాజకీయ కుట్రతోనే ఐటీ దాడులు చేయిస్తుందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. బీజేపీ మమ్మల్నే కాదు కేసీఆర్ ను కూడా ఏమీ చేయలేదన్నారు. తన పేరు ప్రతిష్టలు డామేజ్ చేసేందుకు ఐటీ దాడులు చేయించారని ఆరోపించారు. బీజేపీలో చేరితే ఐటీ దాడులుండవు, లేకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసి ఇతర పార్టీల నేతలను భయభ్రాంతులకు గురిచేస్తాయి. ఇంత పెద్ద ఐటీ దాడులు తానేప్పుడు చూడలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దాదాపు 400 మంది ఐటీ అధికారులు 65 బృందాలతో తన కుటుంబ సభ్యులు, విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, క్లర్కులను కూడా విచారించారన్నారు. ఐటీ, ఈడీ దాడులు చేస్తారని సీఎం కేసీఆర్ తమకు ముందే చెప్పారన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా సీఎం కేసీఆర్ చూసుకుంటారన్నారు. ఇక్కడే పాలు, పూలు, బోర్ వేల్, చిట్ ఫండ్ లు నడిపి ఇంతలా ఎదిగానని మల్లారెడ్డి చెప్పారు. విద్యా సంస్థలు నడుపుతూ మధ్య తరగతి వారికి ఇంజినీరింగ్ విద్యాను అందుబాటులోకి తీసుకొచ్చానన్నారు.
న్యాయబద్ధంగా వ్యాపారాలు
"నేనేమి అక్రమాలు, దౌర్జన్యాలు చేయలేదు. అన్ని వ్యాపారాలు న్యాయబద్దంగా చేస్తున్నాను. సోదాలు పేరుతో మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. రెండు రోజులుగా భయభ్రాంతులకు గురిచేశారు. ప్రిన్సిపాల్స్ ఇళ్లలో సోదాలు చేసి, వారిని ఇబ్బంది పెట్టారు. అంతా ఆన్ లైన్ లోనే మేనేజ్మెంట్ కోటాలోనే జరుగుతుంది. డొనేషన్లు లేనప్పుడు రూ. 100 కోట్లు ఎలా వస్తాయి. సోదాల్లో రూ.28 లక్షల మాత్రమే దొరికే కోట్లు సీజ్ చేసినట్లు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఐటీ అధికారులు పార్ట్ 1 మాత్రమే అయింది, పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంటాయని బెదిరించారు. భవిష్యత్తులో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. వందల కోట్లు డబ్బులు నా దగ్గర ఉంటే నేను ఈ ఇంట్లో ఎందుకు ఉంటాను. "-మంత్రి మల్లారెడ్డి