KTR On Cantonment : నీళ్లు, కరెంట్ బంద్ చేస్తాం-కంటోన్మెంట్ అధికారులకు మంత్రి కేటీఆర్ వార్నింగ్
KTR On Cantonment : కంటోన్మెంట్ అధికారులపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రోడ్లు బంద్ చేస్తాం, నాలాలపై చెక్ డ్యాంలు నిర్మిస్తామంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
KTR On Cantonment :హైదరాబాద్ అభివృద్ధికి కంటోన్మెంట్ అధికారులు అడ్డుపడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మాట్లాడిన మంత్రి కేటీఆర్... కంటోన్మెంట్ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. కంటోన్మెంట్ అధికారులు రోడ్లు బంద్ చేస్తే, తాము కరెంట్, నీళ్లు బంద్ చేస్తామని కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కార్వాన్ నియోజకవర్గంలో నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. కంటోన్మెంట్‌లో అధికారులు చెక్ డ్యాం నిర్మించి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతుందన్నారు. శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్ఐ అనుమతి ఇవ్వడం లేదని మంత్రి అన్నారు. కంటోన్మెంట్, ఏఎస్ఐ రెండూ అడ్డుపడుతున్నాయని మంత్రి అన్నారు. ఇది మంచి పద్ధతి కాదని మంత్రి హితవు పలికారు.
Live: Replying to a question on ‘Strategic Nala Development Program (SNDP) in Hyderabad’ city https://t.co/7Fw8Zxdo5E
— KTR (@KTRTRS) March 12, 2022
వినకపోతే కఠిన చర్యలు
తెలంగాణ వేరే దేశం అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు కలిసి మెలిసి ఉండాలి కానీ ఇష్టమొచ్చినట్లు రోడ్లు బంద్, నాలాల మీద చెక్ డ్యాంలు కడుతామంటే చూస్తూ ఊరుకోమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తామన్నారు. అవసరమైతే కంటోన్మెంట్ అధికారులకు మంచినీళ్లు, కరెంట్ బంద్ చేస్తామని తేల్చి చెప్పారు. అప్పుడైనా దిగివస్తారని అని కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ అధికారులను తక్షణమే పిలిచి మాట్లాడాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ అధికారులు వినకపోతే తీవ్రమైన చర్యలకు వెనుకామన్నారు. కేంద్రం పైసా సాయం చేయదు కానీ పని చేస్తున్న ప్రభుత్వానికి అవరోధాలు కలిగిస్తుందని కేటీఆర్ ఆరోపించారు.
బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
ఇటీవల కాలంలో కేంద్రంపై టీఆర్ఎస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి టీఆర్ఎస్ నేతలు పదునైన విమర్శలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో మొదలైన మాటల యుద్ధం నిత్యం ఏదో అంశంపై రగులుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ కేంద్రంపై విమర్శలు చేశారు. తెలంగాణకు అభివృద్ధికి అడ్డుపడుతోందని మండిపడ్డారు. హైదరాబాద్ నాలా అభివృద్ధిపై అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో సమాధానమిచ్చిన క్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు.