KTR On Vizag Steel Plant : కేసీఆర్ దెబ్బకు వెనక్కి తగ్గిన కేంద్రం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్ - మంత్రి కేటీఆర్
KTR On Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేసీఆర్ పోరాటం వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR On Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ప్రైవేటు సంస్థలకు అమ్మే ప్రక్రియ చేయడం లేదన్నారు. ఈ విషయంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్ పడిందని, ఏపీలో బీఆర్ఎస్ సాధించిన తొలివిజయం ఇదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారన్నారు. సీఎం కేసీఆర్ పోరాటంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడింది కేసీఆరే అన్నారు. బీఆర్ఎస్ తెగించి కొట్లాడింది కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
"విశాఖ ఉక్కు పరిశ్రమపై గట్టిగా మాట్లాడింది కేసీఆర్. మీరు అధికారం ఉందని ప్రైవేటుపరం చేస్తున్నారు. ఎట్లా అమ్ముతారో మేము చూస్తాం. అదానీకి ఇచ్చిన బైలదిల్లా గనుల వల్ల ఇక్కడ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడంలేదు, అటు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని కేసీఆర్ గట్టిగా ప్రశ్నించారు. మీరు ఎట్లా చేస్తారో చూస్తా అన్నారు. అవసరమైతే మా సింగరేణి అధికారులను పంపుతా అన్నారు. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాత్కాలికంగా విరమించుకుంటున్నామని కేంద్రం తెలిపింది. కేసీఆర్ దెబ్బ అంటే అట్లుంటది. కేసీఆర్ ఏ పని మొదలుపెట్టినా అలా ఉంటుంది." - మంత్రి కేటీఆర్
స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి లేఖ
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని మంత్రి కేటీఆర్ ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానుకోవాలంటూ మండిపడ్డారు. వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్రం కొత్త కుట్ర చేస్తుందన్న కేటీఆర్ లేఖలో ఆరోపించారు. తన కార్పొరేట్ మిత్రులకు 12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధానమంత్రి మోదీకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల ఇదే ఔదార్యం ఎందుకు లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రమే వర్కింగ్ కాపిటల్ కోసం ఆర్థిక సహాయం అందించి వైజాగ్ స్టీల్ నుంచి స్టీల్ ఉత్పత్తులు కొనాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీలీనాన్ని పరిశీలించాలని లేఖలో కోరారు. కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన రూ. 5వేల కోట్ల రూపాయలను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి ఏమన్నారంటే?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి ఫగన్ సింహ్ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని అన్నారు. ఇప్పటికిప్పుడు ప్రైవేటు సంస్థలకు అమ్మే ప్రక్రియ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్‌ను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. స్టీల్ ప్లాంటులో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ముడి సరకు పెంపొందించే ప్రక్రియపై ఫోకస్ చేసినట్లుగా చెప్పారు. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని అన్నారు. దీనిపై ఆర్‌ఐఎన్‌ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తాం. ఆర్‌ఐఎన్‌ఎల్ అధికారులతో భేటీ అవుతున్నామని చెప్పారు. వారితో మరిన్ని విషయాలు చర్చిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయడానికి ప్రయత్నిస్తుండడం ఒక బూటకం మాత్రమేనని కొట్టిపారేశారు. బిడ్డింగ్‌లో పాల్గొనడం వారి పరిధిలోని విషయం అని అన్నారు.