(Source: Poll of Polls)
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు లేదు - ప్రయాణికులకు అధికారుల క్లారిటీ
Hyderabad News: హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ లో ఎలాంటి మార్పులు లేవని అధికారులు స్పష్టం చేశారు. కాగా, మెట్రో టైమింగ్స్ మారాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Hyderabad Metro Clarity On Timings: ప్రయాణికుల రద్దీ కారణంగా హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ వస్తోన్న వార్తలను మెట్రో అధికారులు ఖండించారు. మెట్రో రాకపోకల్లో ఎలాంటి మార్పు లేదని.. ఎప్పటిలానే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం రాత్రి 11:45 గంటల వరకు, అలాగే, ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటల నుంచే రైళ్ల రాకపోకలపై పరిశీలన మాత్రమే జరిగిందని.. ఇంకా ఆ టైమింగ్స్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ వంటి వాటిపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మెట్రో రైళ్ల టైమింగ్స్ విషయంలో ప్రయాణికులెవరూ అయోమయానికి గురి కావొద్దని, యథావిధిగా నిర్దిష్ట సమయానికే రాకపోకలు ఉంటాయని స్పష్టత ఇచ్చారు. కాగా, మెట్రో టైమింగ్స్ మారాయని.. ప్రతిరోజూ రాత్రి 11:45 గంటల వరకూ చివరి రైలు అందుబాటులో ఉంటుందని.. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే మెట్రై రాకపోకలు ప్రారంభం కానున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై అధికారులు క్లారిటీ ఇచ్చారు.