TS Assembly Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు, ఈవీఎంల సన్నద్ధతపై ఆదేశాలు
TS Assembly Elections : తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఈసీ బృందం హైదరాబాద్ లో పర్యటించి సీఈవోతో భేటీ అయింది.
TS Assembly Elections : తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈసీ బృందం హైదరాబాద్ లో పర్యటిస్తుంది. డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలోని ఈసీ బృందం తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ వికాస్‌రాజ్, ఇతర అధికారులతో శనివారం సమావేశమైంది. ఈవీఎంల సన్నద్ధత, ఇతర అంశాలపై రాష్ట్ర అధికారులతో ఈసీ బృందం ఈ భేటీలో చర్చింది. అదే విధంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులుపై ఈసీ అధికారులు సమీక్షించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
పోలింగ్ శాతం పెంచేలా కార్యక్రమాలు
ఎన్నికల రిటర్నింగ్ అధికారుల జాబితాను సిద్ధం చేయాలని సీఈవో వికాస్ రాజ్ ను ఈసీ బృందం ఆదేశించింది. జూన్ 1 నుంచి ఈవీఎంల చెకింగ్ చేపట్టాలని సూచించింది. రెండ్రోజుల పాటు జిల్లా ఎన్నికల అధికారులకు వర్క్ షాప్ నిర్వహిస్తామని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఈవీఎంలను పరీక్షించి జిల్లాలకు పంపించామన్నారు. ఎన్నికల అధికారులకు తగిన శిక్షణ ఇస్తామన్నారు. పోలింగ్ శాతం పెంచేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఈసీ బృందం సీఈవోకు సూచించింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో చివరిగా 2018 డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
సమయం లేదు, ఎన్నికలకు సిద్ధంగా ఉండండి - సీఎం కేసీఆర్
శాసనసభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం డిసెంబరులోనే జరుగుతాయని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ముందస్తు ఆలోచనలేదని పార్టీ నేతలతో అన్నారు. సెప్టెంబరు, అక్టోబరులో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముంటుందన్నారు. ఎన్నికలు ఇప్పటి నుంచే సమాయత్తం అవ్వాలని, అందుకు తగిన విధంగా ఆత్మీయ సమ్మేళనాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారని పార్టీ క్యాడర్ ను ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని, సమయం లేదు జనంలోనే ఉండండని ఇటీవలే బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
ఎన్నికలు దగ్గరి కొచ్చాయ్, బీ అలెర్ట్ - డీజీపీ అంజనీకుమార్
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అప్పుడే మొదలైంది. శాంతి భద్రతల పరిరక్షణలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు, సంస్థలు పాదయాత్రలు, బహిరంగ సభలు ఎక్కువగా నిర్వహిస్తాయని, ఈ క్రమంలో శాంతిభద్రతల విభాగం, స్పెషల్ బ్రాంచిల పనితీరు అత్యంత కీలకమని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో ప్రతీ బందోబస్తు ప్రతీసారి ఒక పరీక్షగా ఉంటుందని అన్నారు. ప్రతీసారి ఎదురయ్యే కొత్త సవాళ్లకు అనుగుణంగా సరికొత్త వ్యూహంతో పనిచేయాలని డీజీపీ సూచించారు. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా అతివాద పార్టీల సానుభూతిపరులు, మాజీలు, మిలిటెంట్లపై ప్రత్యేక దృష్టిసాధించాలని చెప్పారు.