Kunamneni Samba Shivarao : తమిళిసై తక్షణమే తెలంగాణను వదిలివెళ్లిపోవాలి- కూనంనేని సాంబశివరావు
Kunamneni Samba Shivarao : ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేంలేదని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటామన్నారు.
Kunamneni Samba Shivarao : ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రధాని తెలంగాణ కార్యక్రమాల్లో పాల్గొనే నైతిక హక్కు కోల్పోయారని విమర్శించారు. ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేంలేదన్నారు. హైదరాబాద్ లో మాట్లాడిన కూనంనేని కేంద్రంపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ సాంకేతికంగానే ప్రధాని అన్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. 12న రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గవర్నర్ తమిళి సై కూడా కూనంనేని విమర్శలు చేశారు. గవర్నర్ పదవిని రాజకీయ పద్దతుల్లో వాడుకుంటున్నారన్నారు. తెలుగు రాష్ట్రాలను అవమానించేలా తమిళి సై మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి గవర్నర్ వెళ్లిపోవాలని రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామన్నారు. సీపీఐకు ప్రధాన శత్రువు బీజేపీ అన్నారు.
సింగరేణి ప్రైవేట్ పరం
రాజకీయ ప్రయోజనాల కోసమే ఈనెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీఓపెన్ చేసేందుకు ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రధానికి తెలంగాణపై ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ఏడాది క్రితం ప్రారంభమైన ఎరువుల ఫ్యాక్టరీనీ మళ్లీ రీ ఓపెన్ చేయడం ఏంటని కూనంనేని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తెలిపారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో బొగ్గును పారిశ్రామిక వేత్తలు కట్టబెట్టేందుకు ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని విమర్శించారు.
కనీస మర్యాద లేదు
రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి సీఎం కేసీఆర్‌ని ఆహ్వానించాలనే కనీస మర్యాద, గౌరవం కూడా ప్రధానికి లేదని కూనంనేని విమర్శించారు. పరాయి పాలకులు వచ్చి దేశాన్ని మింగినట్టుగానే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను బీజేపీ మింగడమే పనిగా పెట్టుకుందన్నారు. సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. కేంద్రంపైన పోరాటం చేస్తే తమపై దేశద్రోహం లాంటి ఏ కేసులు పెడుతారో తెలియదన్నారు. ఏ కేసులు పెట్టినా తాము ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా, సమాజానికి మంచి చేసే వారితో తమ స్నేహం కొనసాగుతోందన్నారు. చివరకు కాంగ్రెస్ వచ్చినా కలుపుకుంటామని కూనంనేని సాంబశివరావు అన్నారు.
గవర్నర్ వ్యవస్థ రద్దు
తమిళనాడు, కేరళ, దిల్లీ, తెలంగాణలో గవర్నర్ ల పనితీరు వివాదాస్పదంగా ఉందని కూనంనేని సాంబశివరావు అన్నారు. బ్రిటీషర్ల కాలంలో వచ్చిన గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ గవర్నర్ బీజేపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే తమిళిసై తెలంగాణను వదిలివెళ్లిపోవాలన్నారు. గవర్నర్ తీరుకు నిరసనగా త్వరలో రాజ్ భవన్ ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రధాని పర్యటనకు నిరసనగా ఈనెల 10న ఐదు జిల్లాల్లోని బొగ్గు గనుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు.