BJP MP Dharmapuri Arvind : చంపుతానని బెదిరించిన ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోండి, హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అర్వింద్
BJP MP Dharmapuri Arvind : ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హైకోర్టును ఆశ్రయించారు.
BJP MP Dharmapuri Arvind : బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను చంపుతానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా ముఖంగా మాట్లాడారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎంపీ అర్వింద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే హైదరాబాద్ లోని తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. తనను, తన కుటుంబ సభ్యులను అవమానించిన కవితపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఎంపీ అర్వింద్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
దాడులు చేసిన వారిపై చర్యలు
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు మంగళవారం విచారణ జరిగింది. పిటిషనర్ తరపున న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. 2020 నుంచి అర్వింద్ పై దాడులు జరుగుతూనే ఉన్నాయని లాయర్ కోర్టుకు తెలిపారు. ఇటీవల ఒక ఎమ్మెల్సీ బహిరంగంగా చంపుతా అన్ని ప్రకటన కూడా చేశారన్నారు. ఏకంగా ఓ పార్టీ నేతలు ఇంటికి వెళ్లి దాడులు చేశారని కోర్టుకు తెలిపారు. ఈ దాడిలో ఎంపీ తల్లికి గాయలైయ్యాయన్నారు. ఇలాంటి దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ప్రభుత్వం తరపు వాదనలు వినిపించిన ఏజీ బిఎస్ ప్రసాద్... ఒక ఎంపీగా ఉంచి అసభ్య పదజాలంతో దుషించడం సరైంది కాదని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే దాడులకు సంబంధించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిందన్నారు.
ముగిసిన వాదనలు
ఎంపీ ధర్మపురి అర్వింద్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేసింది. ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన తీరుపై ధర్మపురి అర్వింద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం తరచూ జరిగేదేనని కోర్టు తెలిపింది. ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాలని కోరింది. బయట జరిగే రాజకీయ పరిణామాలను మీడియా, పత్రికల్లో చూస్తున్నామని కోర్టు పేర్కొంది. ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారని తెలిపింది. కరీంనగర్ లో అర్వింద్ పై దాడి చేస్తామని బెదిరించారని ఎంపీ అర్వింద్ తరఫు న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు. అయితే ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఎంపీ అర్వింద్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఏజీ అన్నారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇంకా నిందితులు ఎవరైనా ఉంటే వారిని కూడా కేసులో చేర్చాలని తెలిపింది. ఇరు పక్షాల వాదనలు ముగియడంతో పిటిషన్ పై విచారణ ముగిసింది.
ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి
బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు ఇటీవల దాడి చేశారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉన్న ఇంటిపై దాడి జరిగింది. ఆ సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. ఈ దాడిలో ఇంట్లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం అయ్యాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రయత్నిస్తున్నారని ఎంపీ అర్వింద్ చేసిన కామెంట్స్‌తో ఈ చిచ్చు రేగినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఫోన్ చేసిన కవిత తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటూ చెప్పారని ఎంపీ అర్వింద్ కామెంట్ చేశారు. దీనిపై టీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎంపీ ధర్మపురి అర్వింద్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే చెప్పుతో కొడతానని ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ధర్మపురి అర్వింద్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే అర్వింద్‌ను వెంటపడి కొడతామన్నారు. పరిధి దాటితే మెత్తగా తంతామన్నారు. తమాషాలు చేస్తే ఊరుకోబోమన్నారు. ఇంకో సారి లైన్ దాటి మాట్లాడితే కొట్టి కొట్టి చంపుతామని హెచ్చరించారు.