Bandi Sanjay : విద్యుత్ బిల్లులో మీటర్లు పెట్టాలని ఉంటే రాజీనామా చేస్తా- బండి సంజయ్ సవాల్
Bandi Sanjay : సీఎం కేసీఆర్ సవాల్ ను యాక్సెప్ట్ చేస్తున్నానని బండి సంజయ్ అన్నారు. విద్యుత్ బిల్లులో మోటర్లకు మీటర్లు పెట్టాలని ఉంటే రాజీనామా చేస్తానని లేకపోతే కేసీఆర్ రాజీనామా చేయాలన్నారు.
Bandi Sanjay : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలైంది. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బయలుదేరిన బండి సంజయ్ గాజులరామారంలోని చిత్తారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ర్యాలీగా వెళ్లి సూరారంలోని కట్ట మైసమ్మ ఆలయాన్ని వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రాంలీలా మైదానంలోని నిర్వహించిన బహిరంగ సభ పాల్గొని నాలుగో విడత పాదయాత్ర ప్రారంభించారు. బహిరంగ సభలో మాట్లాడుతూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకపోతే కరెంట్ కట్ చేసేలా కేంద్రం విద్యుత్ బిల్లును రూపొందించిందంటూ సీఎం కేసీఆర్ నిండు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎక్కడివో పాత పేపర్లను, చిత్తు కాగితాలను పట్టుకుని అసెంబ్లీని కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిందంతా అబద్దమని నిరూపించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.
రాజీనామాకు సిద్ధం
‘‘కేసీఆర్ ఇదిగో కేంద్ర విద్యుత్ బిల్లు నీకు పంపిస్తున్నా. తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయ్. పవిత్రమైన అసెంబ్లీనే తప్పుదోవ పట్టించిన నువ్వు వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే. ఒకవేళ నేను చెప్పేది తప్పయితే రాజీనామాకు సిద్ధం’’అని బండి సంజయ్ సవాల్ విసిరారు. బీజేపీ పేరుతో మోటార్లకు మీటర్లు పెట్టేందుకు, కరెంట్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారం మోపేందుకు కేసీఆర్ కుట్రకు తెరదీశారని ఆరోపించారు. బీజేపీ పేరుతో మోటార్లకు మీటర్లు పెడితే ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్టి తీరుతామని హెచ్చరించారు. ఆర్టీసీ విషయంలోనూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 99 ఏళ్ల లీజు పేరుతో విలువైన ఆర్టీసీ డిపోలు, ఆర్టీసీ స్థలాలను కేసీఆర్ తన అనుచరులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం చేయనీయబోమన్నారు. బీజేపీ చేపట్టిన 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కుత్బుల్లాపూర్ లోని రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వేలాది మందిని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.
హైదరాబాద్ గుంతలమయం
కుత్బుల్లాపూర్ మినీ భారత్ అని, ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్లు కలిసి ఉంటారని బండి సంజయ్ అన్నారు. అసోం సీఎం వస్తే భద్రత కల్పించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు పెట్టారన్నారు. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుడి మొదలు, కంపెనీల సీఈవోల వరకు ఉండే ప్రాంతమిదన్నారు. ఇక్కడ కంపెనీల్లో వాటా కావాలని సీఎం కుటుంబం ఒత్తిడి తెస్తుంటే తట్టుకోలేక ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ ను ఏ విధంగా నాశనం చేశారో ప్రజలకు చెప్పడానికే పాదయాత్ర చేస్తున్నానని బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ ను డల్లాస్, లండన్, సింగపూర్, న్యూయార్క్ చేస్తానన్న కేసీఆర్, గుంతలమయం చేశారని ఆరోపించారు. కేంద్ర నిధులతో ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్జీలు కట్టి అదే అభివృద్ధి అంటున్నారన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, చినుకు పడితే హైదరాబాద్ మునిగిపోయే దుస్థితి ఏర్పడిందన్నారు. నాలాలు, చెరువులను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు
"కేసీఆర్ నిండు అసెంబ్లీలో కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టాలని షరతు పెడుతోందంటూ అబద్దం చెప్పిండు. మోటార్లకు మీటర్లు పెడతానని ఎవరు చెప్పారు? 30 గ్రామాలకిచ్చే కరెంట్ ను నీ ఫాంహౌజ్ ను వాడుకుంటున్నావ్. రైతుల పేరుతో మంత్రులు, సీఎం సహా పాంహౌజ్ లకు కరెంట్ వాడుతున్నారు. ఎక్కడివో పాత పేపర్లు అసెంబ్లీలో చూపెట్టి కేంద్ర ఆదేశాలంటూ శాసనసభనే తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు. తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లు -2022ను నేనే పంపిస్తా. ఈ బిల్లులో ఎక్కడైనా మోటార్లకు మీటర్లు పెట్టాలని ఉంటే నేను రాజీనామా చేస్తా? నువ్వు మాట్లాడింది తప్పని నిరూపిస్తా? రైతు పక్షపాతివైతే రాజీనామా చెయ్... ముక్కు నేలకు రాయి. పవిత్రమైన శాసనసభలో పనికిరాని పేపర్లను చూపి సభనే తప్పుదోవ పట్టిస్తావా?"- బండి సంజయ్
10 రోజుల పాటు పాదయాత్ర
ప్రజా సంగ్రామయాత్ర నాలుగో విడత 10 రోజుల పాటు హైదరాబాద్ చుట్టుపక్కల సాగనుంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్ తో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో మొత్తం 115.3 కిలోమీటర్లు బండి సంజయ్ నడవనున్నారు. ఈ నెల 22న పెద్ద అంబర్ పేట ఔటర్ రింగు రోడ్డు వద్ద పాదయాత్ర ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటుచేయనున్నారు. ఈ సభలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొనే అవకాశం ఉంది.