Bandi Sanajay On Kcr: సీఎం కేసీఆర్ పై దేశం ద్రోహం కేసు పెట్టాలి... ఉద్యోగులపైకి నిరుద్యోగులను రెచ్చగొడున్నారు... బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు
రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ అంబేడ్కర్ ను అవమానించారని బండి సంజయ్ ఆరోపించారు. ఆయనపై దేశ ద్రోహం కేసు పెట్టాలన్నారు.
దేశానికి విప్లవాత్మకమైన, చారిత్రత్మకమైన బడ్జెట్ అందించిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. కరోనా టైంలో పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తారని మేధావులు, ఆర్థికవేత్తలు ఆలోచిస్తున్న ఈ తరుణంలో ట్యాక్స్ ఫ్రీ బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. నిర్మలా సీతారామన్, మోదీ దేశం కోసం జీవితాలను ధారపోస్తున్నారన్నారు. పైసా అవినీతి లేకుండా అహర్నిశలు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. బడ్జెట్ పై సీఎం కేసీఆర్ చాలా నీచంగా మాట్లాడారని అన్నారు. ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ వాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ కు మతి తప్పి మాట్లాడుతున్నారని ఆరోపించారు.
అంబేడ్కర్ ను అవమానించారు
'రాజ్యాంగాన్ని తిరగరాయాలట. నీ అక్కసు ఇప్పుడు బయటపడింది. మహనీయుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ ను దారుణంగా అవమానించినావు. ప్రపంచంలోని గొప్ప ప్రజాస్వామ్య దేశంగా తయారు చేసిన రాజ్యాంగం మనది. ప్రపంచమంతా కీర్తించే రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ను అవమానిస్తారా?. సీఎంలో ఎంతో అహంకారం దాగి ఉంది. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేస్తే ఆ మహనీయుడిని అవమానిస్తున్నావు. దళిత ద్రోహివి నువ్వు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తిరగరాస్తుందని చెప్పింది కేసీఆరే. మేం ఏనాడైనా తిరగరాశామా? లేదే. దళిత సమాజం సీఎం వ్యాఖ్యలపై స్పందించాలి. కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాల్సిందే. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చ జరగాల్సిందే.
బ్లాక్ మెయిల్ రాజకీయాలు
దేశంలో సీఎం కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని బండి సంజయ్ ఆరోపించారు. అందుకే తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. ఇన్నాళ్లూ ప్రధాని మోదీ బడ్జెట్ నచ్చింది. ఇప్పుడు మాత్రం నచ్చలేదా? అని ప్రశ్నించారు. ఎంఎస్ ఫీ కోసం ఈ ఏడాది రూ.2 లక్షల 37 వేల కోట్లు గోధుములు, ధాన్యం కొనడానికి మాత్రమే బడ్జెట్లో పెట్టారని గుర్తుచేశారు. రైతులు తెలంగాణలో కోటీశ్వర్లు అయితే రైతుల ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తిసిన టీఆర్ఎస్ ప్రభుత్వం... ధాన్యం కొనబోమని చెప్పిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ఎంఎస్ పీ రూ.1310 నుంచి రూ.1960 పెంచిందన్నారు. 2018 ఎన్నికల తర్వాత సారు-కారు-16 అన్నారని ఎంపీ బండి సంజయ్ గుర్తుచేశారు. 317 జీవో పేరుతో ఉద్యోగుల్ని అవమానిస్తున్నారన్నారు. ఈ జీవో మంచిదైతే 10 మంది ఉద్యోగులు ఎందుకు సూసైడ్ చేసుకున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులపైకి నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారన్నారు.