Huzurabad Padyatra: ఈటల రాజేందర్‌కు అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు.. పాదయాత్ర వాయిదా
కొద్ది రోజులుగా విరామం లేకుండా ఈటల పాదయాత్ర కొనసాగుతోంది. దీనివల్ల ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అయిన ఏనుగు రవీందర్ రెడ్డి ప్రకటించారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో జనం మద్దతు కూడగట్టేందుకు పాదయాత్ర చేస్తున్న బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యుల సూచన మేరకు ఈటలను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ‘ప్రజా దీవెన యాత్ర’ పేరుతో ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా విరామం లేకుండా ఆయన ప్రజా దీవెన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈటల కాస్త అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అయిన ఏనుగు రవీందర్ రెడ్డి ప్రకటించారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు జ్వరంతో పాటు కాళ్లనొప్పులు అధికంగా ఉన్నాయని ఏనుగు రవీందర్ రెడ్డి వెల్లడించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించారని, ఆయనకు బీపీ తక్కువ అయినట్లు గుర్తించారని చెప్పారు. ఈటలకు చక్కెర స్థాయులు పెరిగినట్లు వివరించారు. బీపీ 90/60కి పడిపోగా ఆక్సిజన్ స్థాయులు కూడా బాగా తగ్గినట్లు వెల్లడించారు. వీణవంక మండలం కొండపాక వరకూ పాదయాత్ర కొనసాగించడంతో శుక్రవారం మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం బాగా నీరసించిపోయారు. వెంటనే వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
డాక్టర్ల సూచన మేరకు ఈటల తన పాదయాత్రకు స్వల్ప విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఎండా వానా అనే తేడా లేకుండా ఈటల పాదయాత్ర కొనసాగించారు. వర్షంలో తడుస్తూ కూడా పాదయాత్ర సాగింది. దీనివల్లే ఈటల రాజేందర్ నీరసించిపోయారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే, ఈటల నిమ్స్‌లో చేరడంతో ఆయనకు బదులుగా సతీమణి జమున పాదయాత్ర కొనసాగిస్తారని తెలుస్తోంది.
అయితే, జ్వరం తగ్గి, కాస్త ఆరోగ్యం కుదుట పడితే ఈటల ప్రజా దీవెన పాదయాత్రను కొనసాగించే అవకాశం ఉంది. ఈ నెల 19న హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం నుంచి ‘ప్రజా దీవెన యాత్ర’ను ఈటల రాజేందర్ ప్రారంభించడం తెలిసిందే. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 222 కిలోమీటర్లమేర ఆయన పాదయాత్ర సాగింది. గురువారం జమ్మికుంట మండలం విలాసాగర్, పాపయ్యపల్లి, బిజిగిరిషరీఫ్, వెంకటేశ్వర్లపల్లి, కాపులపల్లి, కోరపల్లి, సైదాబాద్ గ్రామాల్లో ఈటల రాజేందర్ ప్రజా దీవెన పాదయాత్ర కొనసాగించారు.