Huzurabad No Schedule : ఈ నెలలో ఉపఎన్నిక షెడ్యూల్ లేనట్లే...? రాజకీయ పార్టీలకు షాకిచ్చిన ఈసీ..!
ఆగస్టు 30వ తేదీలోపు ఉపఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు చెప్పాలని పార్టీలకు ఈసీ లేఖలు రాసింది. అప్పటి వరకూ ఉపఎన్నికల షెడ్యూల్ రాదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
హుజూరాబాద్‌లో అభ్యర్థుల్ని ప్రకటించి.. పథకాలు ప్రారంభించి .. ట్రబుల్ షూటర్లను రంగంలోకి దించి రెడీగా ఉన్న రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం సడెన్ షాక్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘంన నుంచి సంకేతాలు వచ్చాయని.. నేడో రేపో నోటిఫికేషన్ అంటూ హడావుడిపడిపోతున్న వారికి అవన్నీ వట్టి పుకార్లేనని తాజాగా సమాచారం పంపింది. ఎన్నికల బరిలో హడావుడి పడిపోతున్న రాజకీయ పార్టీలకు ఈసీ నుంచి ఓ లేఖ అందింది. దేశంలో ఉపఎన్నికలు, ఐదు రాష్ట్రాలసాధారణ ఎన్నికలపై మీ అభిప్రాయం ఏమిటో చెప్పాలి అనేది ఆ లేఖ సారాంశం. అభిప్రాయం చెప్పడానికి ఈ నెల 30వ తేదీ వరకూ రాజకీయ పార్టీలకు సమయం ఇచ్చారు. ఏదైనా ఎన్నికలు పెట్టే ముందు ఈసీ ఇలారాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకోవడం సహజం. ఆ ప్రకారమే ఈసీ కూడా తన బాధ్యత ప్రకారం అభిప్రాయాలు తెలుసుకుంటోంది.
ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఆ లేఖ ప్రకారం చూస్తే ఈ నెల 30వ తేదీ వరకూ అంటే... రాజకీయ పార్టీలన్నీ అభిప్రాయాలు చెప్పే వరకూ హుజూరాబాద్ ఉపఎన్నికల నోటిఫికేషన్ రాదు., అంటే రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకోవడానికి లేఖలు రాసి తెలుసుకోకుండా ఎలాగూ నోటిఫికేషన్ ఇవ్వరు. ఆ తర్వాత రాజకీయ పార్టీల అభిప్రాయాలను క్రోడీకరించుకుని ఈసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటి వరకూ ఈసీ తీసుకున్న నిర్ణయాలు.. కేంద్రంలో అధికారపార్టీగా బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలను విశ్లేషిస్తే.. ఉపఎన్నికలను ఇప్పుడల్లా పెట్టే అవకాశం లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో కలిపి నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అదే నిజం అయితే రాజకీయ పార్టీల అభిప్రాయం ప్రకారం ఉపఎన్నికలను వాయిదా వేస్తున్నట్లుగా ఆగస్టు 30 తర్వాత ఈసీ ప్రకటించే అవకాశం ఉంది.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడల్లా ఎన్నికలు పెట్టడం మంచిది కాదని తన అభిప్రాయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో చెప్పింది. ఈసీ ఈ అభిప్రాయాన్ని ఉపఎన్నికలకు కూడా పరిగణనలోకి తీసుకుంటే... ఉపఎన్నిక వాయిదా పడటం ఖాయం అనుకోవచ్చు. తెలంగాణ రాజకీయ పార్టీలకు ఎక్కడ నుంచి సమాచారం వచ్చిందో కానీ... గత వారం రోజులుగా ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావొచ్చని హడావుడి పడుతున్నారు. అందుకే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని వాసాలమర్రిలో ముందుగానే ప్రారంభించారు. కానీ.. అలాంటి అవకాశమే లేదని తాజా పరిణామాలతో తెలుస్తోంది. ఈ పరిస్థితి ఇప్పటికే రంగంలోకి దిగినరాజకీయ పార్టీలకు ఇబ్బందికరమే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇప్పుడు ఉపఎన్నికల నోటిఫికేషన్ రాదని.. రాజకీయ పార్టీలకు ఓ క్లారిటీ వచ్చినట్లయింది.