Home Guard Suicide Attempt: జీతం పడలేదని హోంగార్డు ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమంగా ఉందన్న డాక్టర్లు
Home Guard Suicide Attempt: తెలంగాణలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాలు అందలేదు. దీంతో ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. కొందరు అప్పులు చేసి నెట్టుకొస్తున్నారు.
Home Guard Suicide Attempt: తెలంగాణలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాలు అందలేదు. దీంతో ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. కొందరు అప్పులు చేసి నెట్టుకొస్తున్నారు. మరి కొందరు దాచుకున్న సొమ్ముతో నెలంతా లొక్కొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలల నుంచి జీతాలు రావడంలేదని మనస్థాపం చెందిన ఓ హోంగార్డు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన గోశామహల్‌లో మంగళవారం చోటుచేసుకుంది.
హోంగార్డు రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. గత రెండు నెలల నుంచి రవీందర్‌కు జీతాలు రావడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడడంతో పలుమార్లు ఉన్నతాధికారులను కలిసి జీతం గురించి, ఆర్థిక పరిస్థితి గురించి వివరించాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెందిన రవీందర్ గోషామహల్‌లోని హోంగార్డుల హెడ్ ఆఫీస్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
చుట్టుపక్కల గమనించి మంటలను ఆర్పివేశారు. రవీందర్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రవీందర్‌కు 55 శాతం గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికులు ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు.