Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Telangana News: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
Heavy Temparatures in Telangana: తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే వేడి ఎక్కువవుతోంది. గురువారం 6 జిల్లాల్లో రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం, మంచిర్యాల జిల్లా హాజిపూర్ మండలాల్లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్ నెలకు సంబంధించి గత పదేళ్లలో ఇదే అధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలను మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో ఏప్రిల్ నెలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు తాకడం కూడా ఇదే మొదటిసారి. అటు, 5 జిల్లాల్లో 44.9 డిగ్రీలు, 4 జిల్లాల్లో 44.8 డిగ్రీలు నమోదయ్యాయి. సగటున 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మేలో పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
గురువారం 6 జిల్లాల్లోని 17 మండలాల్లో వడగాలులు వీచాయి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి, పాలకేడు, నూతన్ కల్, మునగాల, నల్గొండ జిల్లా అనుముల హాలియా, నాంపల్లి, తిరుమలగిరి (సాగర్), భద్రాద్రి జిల్లా సుజాతనగర్, కొత్తగూడెం, చండ్రుగొండ, వరంగల్ లోని ఖిల్లా వరంగల్, దూగొండి, చెన్నారావుపేట, సిద్ధిపేట జిల్లాలోని ధూల్ మిట్ట, సిద్ధిపేట పట్టణం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చేర్యాల, రేగొండ మండలాల్లో వడగాలులు వీచాయి. వడగాలులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వృద్ధులు, చిన్నారులు అవసరమైతేనే బయటకు రావాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరించింది. వడదెబ్బకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అత్యవసరం అయితేనే బయటకు రావాలని తెలిపింది.
వడదెబ్బతో..
రాష్ట్రంలో వడదెబ్బకు గురై పలువురు మృత్యువాత పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామారావుపల్లిలో మట్కం గంగారాం (42), కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ లో పూదరి కనకయ్య (70), కుమురం భీం జిల్లా కౌటాల మండలం జనగాంలో వేలాది మధుకర్ (24), జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో కావలి వెంకటమ్మ (60), ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం దస్నాపూర్ పంచాయతీ దస్నాపూర్ గూడలో కరాడే విష్ణు (45) వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. అలాగే, మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ కొండ మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన కావలి నీలకంఠం (32) పిడుగుపాటుతో మృతి చెందారు.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 21న గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో.. ఈ నెల 22న ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 20, 21 తేదీల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఏపీలోనూ
అటు, ఏపీలోనూ వడగాల్పులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. సాధారణం కంటే 3 - 6 డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు మరింత తీవ్రం కానున్నాయి. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గురువారం అత్యధికంగా అల్లూరి జిల్లా ఎర్రంపేట, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడల్లో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. శుక్రవారం 91 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 245 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. శనివారం 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 215 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
Also Read: Telangana News: రెండు రాష్ట్రాల్లోనూ ఈ ప్రజలు ఓటేస్తారు, ఈ 12 గ్రామాల్లో వింత పోకడ!